IndiGo: ఆలస్యానికి తోడు వెబ్ అప్‌గ్రేడ్.. ఇండిగోపై మండిపడుతున్న ప్రయాణికులు
ABN , Publish Date - Jan 17 , 2024 | 02:05 PM
ఇండిగో విమానాల(IndiGo Aeroplanes) వ్యవహారం రోజు రోజుకి పెరుగుతోంది. విమానాల ఆలస్యంపై ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇటీవల ప్రయాణికులు విమానాశ్రయ రన్ వేపై కూర్చుని భోజనాలు చేశారు.
ఢిల్లీ: ఇండిగో విమానాల(IndiGo Aeroplanes) వ్యవహారం రోజు రోజుకి పెరుగుతోంది. విమానాల ఆలస్యంపై ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇటీవల ప్రయాణికులు విమానాశ్రయ రన్ వేపై కూర్చుని భోజనాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కేంద్రం స్పందించి.. ఇండిగో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా ఇండిగో నుంచి వెలువడిన ఇంకో ప్రకటన ప్రయాణికులు కోపాన్ని రెట్టింపు చేస్తోంది.
ఆ కంపెనీ యాజమాన్యం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. "విమానం ఆలస్యం కావడంతో వెబ్ సైట్ క్రాష్ అయింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకే అప్‌గ్రేడ్ చేస్తున్నాం. దీంతో ప్రయాణికులు ఎలాంటి బుకింగ్‌లు చేయలేరు. బుకింగ్ లను సవరించలేరు. సైట్‌లో ఇన్ సౌకర్యాన్ని పొందలేరు. త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తాం. జనవరి 17న రాత్రి 8.30వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది" అని ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చింది. ప్రయాణికుల సహనాన్ని ఇండిగో పరీక్షిస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
రీసెంట్‌గా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఢిల్లీ-గోవా 6E2175 విమానం కొన్ని గంటలపాటు ఆలస్యం కావడంతో.. కో-కెప్టెన్‌పై ఒక ప్యాసింజర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఆలస్యానికి గల కారణాలేంటో కో-కెప్టెన్ అనూప్ కుమార్ వివరిస్తుండగా.. సాహిల్ కతారియా అనే ప్రయాణికుడు ఒక్కసారిగా దూసుకొచ్చి ఆయన్ను కొట్టాడు. అందుకు అతనిపై తగిన చర్యలు కూడా తీసుకున్నారు.
అయితే.. లేటెస్ట్‌గా ఆ ప్రయాణికుడు ఈ దాడి చేయడం వెనుక గల అసలైన కారణమేంటో వెలుగులోకి వచ్చింది. అతడు హనీమూన్ కోసం గోవాకి వెళ్తున్నాడని, కానీ 12 గంటలపాటు ఫ్లైట్ ఆలస్యం కావడంతో సహనం కోల్పోయి ఈ దాడి చేశాడని తేలింది.