BJP supremo: బీజేపీ చీఫ్‌గా ఖట్టర్ లేదా చౌహాన్!
ABN , Publish Date - Dec 08 , 2024 | 05:12 AM
బీజేపీ అధిష్ఠానం సంస్థాగత మార్పులకు రంగం సిద్ధం చేసిందా? జేపీ నడ్డా స్థానంలో..
రేసులో రాంమాధవ్ కూడా..
తెలుగు రాష్ట్రాల్లోనూ నాయకత్వ మార్పులు!
న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అధిష్ఠానం సంస్థాగత మార్పులకు రంగం సిద్ధం చేసిందా? జేపీ నడ్డా స్థానంలో.. బీజేపీ చీఫ్‌గా మనోహర్‌ఖట్టర్ లేదా శివరాజ్ చౌహాన్ అధ్యక్ష పదవిని అధిరోహించనున్నారా? రేసులో రాంమాధవ్ కూడా ఉన్నారా? ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. వచ్చే నెలాఖరులోగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక, ఆఫీస్ బేరర్ల పునర్వ్యవస్థీకరణ పూర్తవనున్నట్లు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు.. వచ్చేనెల మొదటి వారానికి రాష్ట్రాల వారీగా అధ్యక్షుల నియామకాలు పూర్తవుతాయని వివరిస్తున్నాయి. వచ్చే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఖట్టర్ లేదా శివరాజ్‌ను నియమించే అవకాశాలున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాంమాధవ్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. ఒకవేళ ఆయనకు చాన్స్ రాకుంటే.. బీఎల్ సంతోష్ స్థానంలో ఆయనను సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా అవకాశాలున్నట్లు చెబుతున్నారు. బీఎల్ సంతోష్ 2019 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇక రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలతోపాటు.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళల్లో అధ్యక్షులు మారే అవకాశాలున్నాయి.