Loksabha Elections: రాజకీయాల్లోకి లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే..?
ABN , Publish Date - Mar 18 , 2024 | 01:54 PM
లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు రోహిణి ఆచార్య లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. లాలు కుటుంబానికి కంచుకోట అయిన సరన్ లోక్ సభ నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ప్రస్తుతం లాలు కుటుంబం నుంచి ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, పెద్ద కూతురు మిసా భారతి రాజకీయాల్లో ఉన్నారు.
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) మరో కూతురు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా..? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? కంచుకోట సరన్ (saran) నుంచి బరిలోకి దిగుతారా అంటే ఔననే అంటున్నాయి ఆర్జేడీ వర్గాలు. లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కూతురు రోహిణి ఆచార్య (Rohini Acharya) లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. లాలు కుటుంబానికి కంచుకోట అయిన సరన్ లోక్ సభ నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
ప్రస్తుతం లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబం నుంచి ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, పెద్ద కూతురు మీసా భారతి రాజకీయాల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రులుగా పనిచేశారు. మరో కూతురు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యానికి గురయిన సమయంలో కూతురు రోహిణి అండగా నిలిచారు. తండ్రికి తన కిడ్నీని అందజేసి ప్రేమను చాటుకున్నారు. సింగపూర్ ఆస్పత్రిలో 2022 డిసెంబర్‌లో లాలు ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది.
ఆర్జేడీ పార్టీ సమావేశం పాట్నాలో ఆదివారం జరిగింది. సరన్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిపై చర్చ వచ్చింది. రోహిణి ఆచార్య పేరును ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సరన్ లోక్ సభ స్థానం నుంచి రోహిణి ఆచార్య పోటీ చేయడం ఖాయమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.