Share News

Narayana Murthy: వాతావరణ మార్పులతో హైదరాబాద్‌కు వలసలు పెరుగుతాయ్: ఇన్ఫీ నారాయణ మూర్తి

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:32 AM

వాతావరణ మార్పులు ముదిరే కొద్ది హైదరాబాద్, బెంగళూరు, పూణె వంటి నగరాలకు వలసలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హెచ్చరించారు.

Narayana Murthy: వాతావరణ మార్పులతో హైదరాబాద్‌కు వలసలు పెరుగుతాయ్: ఇన్ఫీ నారాయణ మూర్తి

ఇంటర్నెట్ డెస్క్: వాతావరణ మార్పులు ముదిరే కొద్దీ హైదరాబాద్, బెంగళూరు, పూణె వంటి నగరాలకు వలసలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హెచ్చరించారు. ప్రకృత్తి విపత్తులు తట్టుకోలేని ప్రాంతాల నుంచి లక్షలకొద్దీ జనాభా నగరాలకు వలస పోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నానాటికీ పెరుగుతున్న భూతాపం, తీవ్ర ప్రకృత్తి విపత్తలు భారీ స్థాయిలో వలసలకు దారి తీస్తాయని అన్నారు. పూణె శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పాతికేళ్లల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాలు నివాసయోగ్యత కోల్పోతాయని చెప్పారు. ఇప్పటికే మౌలిక వసతుల లేమి కాలుష్యంతో సతమతమవుతున్న నగరాలపై ఈ వలసలు పెను భారం మోపుతాయని చెప్పారు .

వజ్రధూళితో భూతాపానికి చెక్‌!


బెంగళూరూ, పూణె, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయని ఇన్ఫీ నారాయణ మూర్తి గుర్తు చేశారు. కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ వంటివి నగరాల్లో జనాలు నివసించలేని పరిస్థితి కల్పిస్తున్నాయని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కార్పొరేట్ రంగం, రాజకీయనాయకుల, ప్రభుత్వాధికారులు ఒక్కతాటిపైకి వచ్చి పరిష్కారాలు కనుగొనాలని పిలుపునిచ్చారు. వలసలతో నగరాలు కుప్పకూలకుండా ఉండేందుకు ఇది అత్యంత ఆవశ్యకమని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ రంగం ఈ అంశంలో చొరవ తీసుకోవాలని అన్నారు.

ఆ థంబ్‌నెయిల్స్‌పై ఇక నిషేధం


సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ వీటిని అధిగమించే సత్తా భారత్‌కు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికల్లా వాతావరణ లక్ష్యాలు, వలసల విషయంలో దేశం గణనీయమైన పురోగతి సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర కార్యాచరణతో సకాలంలో స్పందిస్తే ఈ సమస్యలను భారత్ సులువుగానే అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరీకరణ వేగవంతం కావడం, జనాభా పెరుగుదల కారణంగా ఇప్పటికే దేశంలో అనేక నగరాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వాతావరణ మార్పుల కారణంగా వలసలు పెరిగి సమస్య మరింత జటిలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మౌలిక వసతులు, వనరులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని వార్నింగ్ ఇస్తున్నారు.

Read Latest and National News

Updated Date - Dec 23 , 2024 | 11:36 AM