Share News

Congress: మోదీకీ హసీనా గతే.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 08 , 2024 | 05:10 PM

బంగ్లాదేశ్‌‌లో షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం కుప్పకూలడంతో.. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రధాని మోదీ(PM Modi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Congress: మోదీకీ హసీనా గతే.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌‌లో షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం కుప్పకూలడంతో.. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ప్రధాని మోదీ(PM Modi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాగ్రహం షేక్ హసీనాను గద్దె దించిన మాదిరిగానే భారత్‌లోనూ ఏదో ఒక రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ప్రజలు ముట్టడిస్తామని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సజ్జన్‌సింగ్‌ వర్మ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా అధికారిక భవనాన్ని నిరసనకారులు ముట్టడించడంతో ఆమె దేశాన్ని వదిలి భారత్‌కి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె భారత్‌కి వచ్చిన రెండ్రోజుల్లోనే కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది.

సజ్జన్ మాట్లాడుతూ.. "ప్రభుత్వ విధానాలు నచ్చక బంగ్లాదేశ్ తరహాలోనే మోదీ ఇంటిని ఏదో ఒక రోజు ప్రజలు ఆక్రమించుకుంటారు. ఇప్పటివరకు శ్రీలంక, బంగ్లాలో ఇలాంటి ఘటనలు జరగ్గా.. త్వరలో భారత్‌లోనూ ఇదే పరిస్థితి రాబోతోంది"అని పేర్కొన్నారు. సజ్జన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


కట్టుబట్టలతో భారత్‌కి...

బంగ్లాను విడిచిపెట్టిన షేక్ హసీనా కట్టుబట్టలతో భారత్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు అధికారిక నివాసం దిశగా దూసుకొస్తుండటంతో ప్రధాని సహా ఆమె సహాయకులు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. నిరసనకారులు సమీపిస్తుండటంతో కనీసం దుస్తులు ఇతర వ్యక్తిగత వస్తువులు సైతం తెచ్చుకునే పరిస్థితి లేకపోయిందని హసీనా సన్నిహితులు వాపోయారు.

ప్రాణాలతో బయటపడటం ముఖ్యమని వారంతా హసీనాతో కలిసి సీ-130 జే విమానంలో భారత్‌కు వచ్చేశారు. భారత్‌కి వచ్చాక ఆఫీసర్లు నిత్యావసరాల కొనుగోలులో వారికి సాయం చేశారు. హసీనా బృందంతో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోబాల్ వారితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 08 , 2024 | 05:10 PM