వయనాడ్‌లో ప్రియాంకతో నవ్య ఢీ
ABN , Publish Date - Oct 23 , 2024 | 06:08 AM
కేరళలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఖాళీచేసిన వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆయన చెల్లెలు ప్రియాంకాగాంధీ వాద్రాపై బీజేపీ ఓ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బరిలోకి దించింది. ఆ పార్టీ తరఫున కోలికోడ్ (క్యాలికట్) కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పదేళ్లుగా
బీజేపీ అభ్యర్థిగా మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
వయనాడ్, అక్టోబరు 22: కేరళలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఖాళీచేసిన వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆయన చెల్లెలు ప్రియాంకాగాంధీ వాద్రాపై బీజేపీ ఓ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బరిలోకి దించింది. ఆ పార్టీ తరఫున కోలికోడ్ (క్యాలికట్) కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పదేళ్లుగా పనిచేస్తున్న నవ్య హరిదాస్ పోటీచేస్తున్నారు. నెహ్రూ కుటుంబ సభ్యురాలిగా ప్రియాంకకు జాతీయ స్థాయిలో పేరు ఉండిఉండొచ్చని.. అయితే ఆమె కంటే తనకే ఎక్కువ రాజకీయానుభవం ఉందని నవ్య మంగళవారం వ్యాఖ్యానించారు. వయనాడ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఎల్‌డీఎఫ్ అభ్యర్థిగా సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకేరీ పోటీచేస్తున్నారు. నవ్య 2009లో మెరైన్ ఇంజనీర్ శోభిన్ శ్యామ్‌ను పెళ్లిచేసుకుని సింగపూర్ వెళ్లారు. అక్కడ నాలుగేళ్లు పనిచేశారు. అనంతరం నెదర్లాండ్స్, అజార్‌బైజాన్‌లో కూడా పనిచేశారు. 2015లో సెలవుపై కోలికోడ్ వచ్చారు. ఆ సమయంలో కోలికోడ్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఆమెకు కరపరంబ వార్డు టికెట్ ఇచ్చింది. ఆమె కుటుంబానికి ఆర్‌ఎ్‌సఎస్ నేపథ్యం ఉండడమే దీనికి కారణం. వరుసగా రెండు దఫాలు గెలిచి పదేళ్లుగా ఆమె కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వయనాడ్ లోక్‌సభ స్థానంలో తమ పార్టీకి సంస్థాగత బలం ఎక్కువగా లేదని ఆమె అంగీకరించారు. అయితే ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండా తనను కచ్చితంగా విజయతీరానికి చేరుస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఇక్కడ తమకు ఏటికేడాదీ బలం పెరుగుతోందన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం బీడీజేఎస్ 78,816 ఓట్లు సాధించగా.. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ 1,41,045 ఓట్లు పొందారని గుర్తుచేశారు. రాహుల్ మెజారిటీ 4,31,770 ఓట్ల నుంచి 3,64,422 ఓట్లకు తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం కారణంగానే ఉప ఎన్నిక జరుగుతోందన్నారు. ఇటీవలి ఎన్నికల్లో వయనాడ్‌లో ఓట్లు కోరుతూ వెలసిన రాహుల్ ఫ్లెక్సీలు ఇప్పటికీ చాలా చోట్ల కనిపిస్తున్నాయని చెప్పారు. రాయ్‌బరేలీలో కూడా గెలిచిన ఆయన ఆ స్థానాన్ని ఉంచుకుని వయనాడ్‌ను వదిలేసి తన చెల్లెలిని పోటీకి దించుతున్నారని, ఇది కుటుంబ ఆధిపత్యానికి నిదర్శనమని.. ఎన్నికల్లో ఇదే తమ ప్రధాన ప్రచారాంశంగా ఉంటుందని నవ్య తెలిపారు.
ప్రియాంక మంచి ప్రతినిధి: రాహుల్
తన చెల్లెలు ప్రియాంక కంటే మంచి ప్రతినిధి వయనాడ్‌కు ఉండరని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆయనతో పాటు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరు కానున్నారు. ‘వయనాడ్ ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. వారికి ప్రియాంక కంటే ఉత్తమ ప్రతినిధిగా మరెవరినీ నేను ఊహించలేను. వయనాడ్ అవసరాలను తీర్చడంలో ఆమె ముందుంటారు. పార్లమెంటులో గట్టిగా తన వాణి వినిపిస్తారు’ అని మంగళవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేసే ముందు 11 గంటలకు కాల్‌పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్, ప్రియాంక రోడ్‌షో నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపిచ్చారు. నవంబరు 13న పోలింగ్ జరుగనుంది. 23న ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.