Sabarimala: శబరిమల యాత్రికులకు బిగ్ అలర్ట్.. అరవణ ప్రసాదం ఇక రెండు డబ్బాలే..
ABN , Publish Date - Jan 06 , 2024 | 12:56 PM
శబరిమల అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది.. డబ్బాలో ఇచ్చే అరవణ పాయసం. ఇష్టదైవం అయ్యప్పను దర్శించుకుని..
శబరిమల అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది.. డబ్బాలో ఇచ్చే అరవణ పాయసం. ఇష్టదైవం అయ్యప్పను దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో భక్తులు ఈ ప్రసాదాన్ని కచ్చితంగా తమ వెంట తీసుకువెళ్తుంటారు. శబరిమల ఎంత ప్రత్యేకమైందో.. అక్కడి ప్రసాదం కూడా అంతే ప్రత్యేకమైనది. అందుకే ఈ ప్రసాదానికి డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్ కు సరిపడా ఏర్పాట్లు చేయకపోవడంతో అరవణ ప్రసాదం సరఫరాపై ఆలయ ట్రస్టు ఆంక్షలు విధించింది. కంటైనర్ల కొరత కారణంగా ఒక్కో భక్తుడికి కేవలం 2 టిన్నులు మాత్రమే అందించాలని నిర్ణయించింది. కాగా గతంలో ఒక్కొక్కరికి 10 డబ్బాలు అందించడం విశేషం.
అరవణ పాయసం పంపిణీకి ఉపయోగించే కంటైనర్లను నిర్వహించే కాంట్రాక్టును రెండు కంపెనీలకు ఇచ్చారు. వీటిలో ఒక కంపెనీ అవసరమైన కంటైనర్లను అందించడంలో విఫలమైంది. దీంతో ప్రసాదం పంపిణీలో సంక్షోభం ఏర్పడింది. శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడం, మకరజ్యోతి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు రానున్న తరుణంలో అరవణ ప్రసాదంపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థానం నిర్ణయంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి గాని.. ఇలా రెండుకు కుదించడం సరికాదని పెదవి విరుస్తున్నారు.
మరోవైపు.. ఈ ఏడాది అయ్యప్ప సన్నిధానానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. రద్దీ కారణంగా కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంటోంది. సంక్రాంతి మకరజ్యోతి దర్శనం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.