Prajwal Revanna case: విచారణను వేగవంతం చేసిన సిట్... ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - May 12 , 2024 | 08:23 PM
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌ల వ్యవహారంలో 'సిట్' విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న చేతన్, లిఖిత్ అనే ఇద్దరు వ్యక్తులను హసన్‌లో ఆదివారంనాడు అరెస్టు చేసింది.
బెంగళూరు: హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌ల వ్యవహారంలో 'సిట్' విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న చేతన్, లిఖిత్ అనే ఇద్దరు వ్యక్తులను హసన్‌లో ఆదివారంనాడు అరెస్టు చేసింది. ఈ ఇద్దరిని హసన్ సిటీలోని ఎన్‌ఆర్ సర్కిల్‌లో వద్ద ఉన్న సైబర్ ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ క్రైమ్ (CEN) పోలీస్ స్టేషన్‌లో విచారణ చేసి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.
నిందితుడు చేతన్‌ను యెలగుండ గ్రామంలోని అతని నివాసంలో కూడా సిట్ టీమ్ గంటన్నర సేపు ప్రశ్నించింది. మరో నిందితుడు లిఖిత్‌ను శ్రామణబెలగోలలోని అతని ఇంట్లో విచారణ జరిపింది. ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ ఏప్రిల్ 21న సర్క్యులేషన్‌లోకి రాగా, దీనిపై రేవణ్ణ మాజీ కారు డ్రైవర్ కార్తీక్, పుట్టరాజు, నవీన్ గౌడ, చేతన్, లిఖిత్‌లపై జేడీఎస్ పోల్ ఏజెంట్ పూర్ణచంద్ర తేజస్వి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, లైంగిక వేధింపులు, కుల వేధింపుల ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన న్యాయవాది, బీజేపీ నేత జి.దేవరాజెగౌడను జిల్లా జైలుకు తరలించారు. ఒక మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై దేవరాజగౌడను గత శుక్రవారం రాత్రి హరియూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకోగా, విచారణ అనంతరం ఆయనను హోలెనరిసిపూర్ పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. మే 24న వరకూ దేవరాజగౌడను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు.