Shashi Tharoor: ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్.. శశిథరూర్ కౌంటర్ ఎటాక్
ABN , Publish Date - Feb 07 , 2024 | 07:04 PM
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బుధవారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌పై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్’ అని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పేదల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బుధవారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌పై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్’ అని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పేదల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. దేశంలో పేదరికాన్ని అంచనా వేసేందుకు కేంద్రం వద్ద సరైన గణాంకాలు లేవని తూర్పారపట్టారు. గత పదేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయం తగ్గిపోయిందని అన్నారు. సంపన్నులు ఖర్చు చేస్తే.. దానివల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారని కేంద్రం భావిస్తోందని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యులను పట్టిపీడిస్తున్న సంక్షోభానికి పరిష్కారం చూపలేని బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని దుయ్యబట్టారు.
ఇదే సమయంలో నోట్ల రద్దు, జీఎస్టీ అంశాల్ని ప్రస్తావిస్తూ.. కేంద్రంపై శశిథరూర్ నిప్పులు చెరిగారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది మంచి ఆలోచనే అని.. కాని దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు. ఇక డీమోనిటైజేషన్‌ని చాలా చెత్తగా అమలు చేయబడిందని తిట్టిపోశారు. జీఎస్టీ కారణంగా రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి దెబ్బతిందని అన్నారు. దానికి నోట్ల రద్దు కూడా తోడవ్వడంతో.. ఉద్యోగాలను సృష్టించే చిన్న, మధ్యతరహా వ్యాపారాలు నాశనం అయ్యాయని చెప్పారు. దీంతో.. 45 ఏళ్ల పాటు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని తెలిపారు. ప్రకటిత లక్ష్యాలను సాధించడంలో విఫలమైనప్పుడు.. సాధారణ భారతీయులు నష్టపోయారన్నారు. చివరికి ప్రాథమిక వస్తువులైన టూత్‌పేస్ట్, పాదరక్షలు, ప్యాంట్ & షర్ట్స్, బియ్యం, గోధుమలు వంటి వాటిపై కూడా జీఎస్టీ పన్ను స్లాబ్‌లు ఉన్నాయన్నారు. నల్లధనాన్ని వెలికితీసే బదులు.. సామాన్య ప్రజల ఖర్చుల్ని పెంచిందన్నారు.
డేటాను ఉటంకిస్తూ.. వ్యవసాయేతర రంగంలో ఉపాధి గణనీయంగా తగ్గిపోయిందని శశిథరూర్ కేంద్రంపై దాడి చేశారు. నిరుద్యోగం బాగా పెరిగిపోవడంతో భారతీయు యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్టప్ రంగానికి నిధులు కూడా సరిగ్గా అందడం లేదన్నారు. ప్రభుత్వం స్టార్టప్ రంగాన్ని ప్రత్యామ్నాయంగా ప్రశంసించింది కానీ.. నిధుల కొరత కారణంగా కొన్ని స్టార్టప్ కంపెనీలు 2022లో 18 వేల మందిని తొలగించాయని గుర్తు చేశారు. 2016లో 6.25 కోట్ల ఎంఎస్ఎంఈ (Ministry of Micro, Small and Medium Enterprises)లు ఉండగా.. డీమోనిటైజేషన్ కారణంగా 3.25 కోట్లకు తగ్గిందని చెప్పుకొచ్చారు.