Share News

Tamilnadu : తిరువణ్ణామలైలో రేపు చిత్రా పౌర్ణమి

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:58 PM

ఈ నెల 23వ తేదీ పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణకు 25 లక్షల మంది భక్తులు రావొచ్చని జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తిరువణ్ణామలైకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం..

Tamilnadu : తిరువణ్ణామలైలో రేపు చిత్రా పౌర్ణమి
Tirumanalai Temple

  • తిరువణ్ణామలైలో రేపు చిత్రా పౌర్ణమి

  • గిరిప్రదక్షిణకు లక్షల్లో రానున్న భక్తజనం

  • ప్రత్యేక బస్సులు నడుపుతున్న అధికార యంత్రాంగం

అడయార్‌, ఏప్రిల్‌ 21: ఈ నెల 23వ తేదీ పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణకు 25 లక్షల మంది భక్తులు రావొచ్చని జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తిరువణ్ణామలైకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపేలా రవాణా శాఖ దృష్టిసారించింది. అలాగే, అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.


ముఖ్యంగా, రాజగోపురం ప్రవేశద్వారం నుంచి ఆలయంలోకి అడుగుపెట్టే భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటుచేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. గిరిప్రదక్షిణ చేసేందుకు 23వ తేదీ వేకువజామున 4.16 నుంచి 24వ తేదీన తెల్లవారుజామున 5.47 గంటల వరకు శుభ సమయమని ఆలయ అధికారులు తెలిపారు. అయితే, 23వ తేదీ మంగళవారం పగటిపూట గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, గిరిప్రదక్షిణ సాగే 14 కిలోమీటర్ల కొండ చుట్టూ గుర్తింపు కార్డులు, ముందస్తు అనుమతి పొందిన వారే అన్నదానాలు చేయాలని ఆయన కోరారు.


1200 ప్రత్యేక బస్సులు...

23వ తేదీ చిత్ర పౌర్ణమి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 1200 బస్సులు నడిపేలా రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం తిరువణ్ణామలై పట్టణంలో 9 తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేశారు. చెన్నై నుంచి తిరువణ్ణామలె వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్సులను దిండివనం బైపాస్‌ రోడ్డులో పార్కింగ్‌ చేసేలా ఏర్పాట్లుచేశారు. సేలం, తిరుపత్తూరు, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల బస్సులు చెంగం రోడ్డులో పార్కింగ్‌ చేసేలా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే బస్సులు వేంగికాల అన్నా జంక్షన్‌ వద్ద పార్కింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే, చెన్నై, వేలూరు, విల్లుపురం ప్రాంతాల నుంచి తిరువణ్ణామలైకు నడిపే ప్రత్యేక రైళ్ళ వివరాలను సోమవారం ప్రకటించనున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో ఆటోల సహా ఇతర వాహనాలను అనుమతించరని పోలీసులు తెలిపారు. దివ్యాంగులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 22 , 2024 | 01:49 PM