Share News

Washington : బైడెన్‌ స్థానంలో మిషెల్‌ ఒబామా?

ABN , Publish Date - Jul 01 , 2024 | 02:53 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్‌ స్థానంలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిషెల్‌ ఒబామాను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Washington : బైడెన్‌ స్థానంలో మిషెల్‌ ఒబామా?

వాషింగ్టన్‌, జూన్‌ 30: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్‌ స్థానంలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిషెల్‌ ఒబామాను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. గురువారం రాత్రి జరిగిన తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో బైడెన్‌ పలుమార్లు తడబాటుగా మాట్లాడటంతో ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్‌ తేలిపోయారనే విమర్శలు వస్తున్నాయి.

అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ తప్పుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మూడు నెలలు ముందు ఆగస్టులో జరిగే డెమోక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ఆ పార్టీ అభ్యర్థిగా మిచెల్‌ ఒబామాను ప్రకటించే అవకాశాలున్నాయని డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు.

‘తొలి డిబేట్‌లో బైడెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. ఆయన తీరుతో దేశవ్యాప్తంగా డెమోక్రాట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా బైడెన్‌ను తొలగించి మిచెల్‌ ఒబామాను బరిలో నిలపాలి. ఆగస్టులో జరిగే డెమోక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ఈ మార్పు జరుగుతుంది’ అని యూఎస్‌ సెనెటర్‌ టెడ్‌ క్రజ్‌ పేర్కొన్నారు. డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా బైడెన్‌ ఉండబోరని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. డిబేట్‌లో బైడెన్‌ మాట్లాడిన తీరు చూసినవారంతా షాకయ్యారని వివేక్‌ రామస్వామి అభిప్రాయపడ్డారు.

Updated Date - Jul 01 , 2024 | 02:54 AM