Share News

Idol of Ganesha : శ్రీపత్రే నమః

ABN , Publish Date - Sep 07 , 2024 | 01:36 AM

విఘ్నాలను తొలగించే మహా నాయకుడు వినాయకుడు. వినాయక చవితి నాడు గణనాథుని ప్రతిమ ప్రతి ఇంట్లో కొలువు తీరుతుంది. ఏకదంతుడి పూజను ఆధ్యాత్మిక సౌరభాలతో, ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఈ పూజలో అనేక పత్రాలను ఆయనకు సమర్పిస్తారు.

Idol of Ganesha : శ్రీపత్రే  నమః

విఘ్నాలను తొలగించే మహా నాయకుడు వినాయకుడు. వినాయక చవితి నాడు గణనాథుని ప్రతిమ ప్రతి ఇంట్లో కొలువు తీరుతుంది. ఏకదంతుడి పూజను ఆధ్యాత్మిక సౌరభాలతో, ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఈ పూజలో అనేక పత్రాలను ఆయనకు సమర్పిస్తారు. పత్రిపూజలోఉపయోగించే ప్రతి ఆకుకు ఒక విశిష్ట ఔషధ గుణముంది. కొత్తమట్టితో గణపతి విగ్రహం చేసి.. దానికి ఆకుపచ్చని పత్రాలతో పూజ చేసి.. వాటన్నింటినీ బావుల్లోను, చెరువుల్లోను వదులుతారు. ఈ పత్రాల్లో ఉన్న ఔషధ గుణాలు - నీటిని శుద్ధి చేస్తాయి. ఇప్పుడు పూజకు ఉపయోగించే పత్రాల్లో ఉండే ఔషధ గుణాలేమిటో చూద్దాం..

1.jpg

మాచీ పత్రం: ఇది అందరికీ తెలిసిన మొక్క. పల్లెల్లో కూడా కనిపిస్తుంది. మాచపత్రి అనేది తెలుగు పేరు. ఈ మొక్క చామంతి జాతికి చెందినది. ఆకులు చీలినట్లుగా ఉంటాయి. పచ్చటి ఆకులను నులిపితే మంచి వాసన వస్తుంది. ఈ ఆకులను చల్లటి నీటితో తడిపి.. అలసిన కళ్ల మీద ఉంచుకుంటే - అలసట తగ్గుతుంది. ఈ ఆకులను పసుపు, నూనెలతో కలిపి మెత్తగా నూరి శరీరానికి రాసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది. చర్మంపై దద్దుర్లు తగ్గుతాయి.


Untitled-2 copy.jpg

దూర్వార పత్రం: ఇదొక గడ్డిజాతి మొక్క. దూర్వం అంటే గరిక. ఇది నారుమళ్లలో ఎక్కువగా పెరుగుతుంది. దీనిలో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు ఉన్నాయి. గరిక గడ్డిలో కాల్షియం,ఫాస్పరస్‌, పైబర్‌, పొటాషియం వంటివి అధికం. దీనిలోని పీచు పదార్థం జీర్ణసంబంధిత వ్యాధుల్ని నివారిస్తుంది. గరిక గడ్డిపొడి కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది. శరీరంపైన గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, నాసిక, ఉదర సంబంధిత వ్యాధులు, మొలల నివారణకు కూడా చక్కటి మందుగా పనిచేస్తుంది.


Untitled-2 copy.jpg

అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్లు ఉండే ఈ చెట్టు చాలా ప్రాంతాల్లో లభిస్తుంది. ఉత్తరేణి ఆకుల నుంచి రసాన్ని తీసి.. పొట్ట మీద పట్టించుకుంటే కొవ్వు కరుగుతుందని కొందరు భావిస్తారు. ఉత్తరేణి ఆకుల్ని ఎండబెట్టి.. కాల్చి బూడిద చేసి.. ఆ పొడిని తేనెలో కలుపుకొని తాగితే ఉబ్బసం, దగ్గు, ఛాతీ సమస్యలు తగ్గుతాయి.


Untitled-2 copy.jpg

బృహతీ పత్రం: దీనిని ములక అంటారు. ఇందులో చిన్న ములక, పెద్ద ములక, నేల ములక అని మూడు రకాలు. ఈ పత్రాలు వంగ ఆకులు మాదిరి, తెల్లని చారలతో ఉంటాయి. ఈ మొక్కకు గుండ్రటి పళ్లు కూడా కాస్తాయి. ఇది వర్షాకాల ప్రారంభంలో బంజరు భూముల్లో కనిపిస్తుంది. దీని పూలు వంగపండు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఈ మొక్క కాయలను జాగ్రత్తగా పీకి రసం తీసి.. తేనెలో కలిపి తలకు రాసుకుంటే పేనుకొరుకుడు తగ్గుతుంది. ఈ మిశ్రమాన్ని నుదుటన రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. ఈ ఆకుల్ని మెత్తగా నూరి.. ఆ మిశ్రమాన్ని మోకాళ్లకు రాసుకుంటే నొపుఁల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని విషపురుగుల విషానికి విరుగుడుగా కూడా భావిస్తారు.


Untitled-2 copy.jpg

దుత్తూర పత్రం: దుత్తూరం అంటే ఉమ్మెత్త. దీనిది వంగ జాతి. కాయలకు ముళ్లు ఉంటాయి. పూలు తెల్లగా ఉంటాయి. ఈ మొక్కను మితంగా వాడితే ఔషధం, అతిగా వాడితే విషం అవుతుంది. మొక్క వేళ్లను శుభ్రంగా కడిగి.. చూర్ణంగా చేసుకుని తేనెతో కలిపి తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఉమ్మెత్త ఆకులకు నూనె రాసి సెగ మీద వేడిచేసి.. గడ్డలపై ఉంచి కట్టుకడితే వాపు, నొప్పి పోతాయి. ఉమ్మెత్త ఆకుల రసాన్ని నువ్వుల నూనెతో కలిపి చర్మంపై రాసుకుంటే దద్దుర్లు, మంట, ఎగ్జిమా వంటివి మాయమవుతాయి. ఇది ఋతుస్రావ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.


Untitled-2 copy.jpg

తులసీ పత్రం: అనాధి నుంచి భారతీయులు పూజించే పవిత్ర మొక్క తులసి. దేవతార్చనలో తప్పక ఉంటుంది. తులసిలోని ప్రతి భాగమూ అద్భుతమైన ఔషధమే. తులసి రసాన్ని పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తులసిని ఎండాకాలంలో తక్కువగా, చలికాలంలో ఎక్కువగా వాడాలి. దీనికి సూక్ష్మజీవుల్ని అంతం చేసే గుణం ఉంది. అందువల్ల దీనిని తరచూ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.


Untitled-2 copy.jpg

జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. ఇందులో సన్నజాజి, విరిజాజి అనే రెండు రకాల మొక్కలు కనిపిస్తాయి. ఈ పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. పువ్వుల సువాసన మనసుకు హాయిని, సాంత్వనను కలిగిస్తుంది. జాజి మొగ్గలతో నేత్ర వైద్యం కూడా చేస్తారు.


Untitled-2 copy.jpg

బదరీ పత్రం: బదరీ అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగ రేగు అని మూడు రకాలు ఉంటాయి. పల్లెల్లో రోడ్ల పక్కన పొదల్లా విస్తారంగా పెరిగే రేగు అంటే తెలియని వాళ్లు ఉండరు. రేగు పళ్లు తీయగా, పుల్లగా గమ్మత్తయినా రుచితో ఉంటాయి. వీటి ఆకుల్ని మేకలు ఇష్టంగా తింటాయి. అధిక రక్తపోటు నియంత్రణకు రేగుపళ్లు ఎంతో తోడ్పడతాయి. ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి.. ఎముకల ధృఢత్వానికి ఉపకరిస్తాయి. రక్తశుద్దికీ, మలబద్ధక నిర్మూలనకు చక్కటి మందు రేగు పండు. దీనిని క్రమం తప్పకుండా సేవిస్తే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. రేగు ఆకులను కూడా ఔషధంగా వాడతారు.


Untitled-2 copy.jpg

చూత పత్రం: అంటే మామిడాకు. ఏ పండగొచ్చినా, శుభకార్యం జరిగినా గుమ్మానికి మామిడి తోరణాలను కడతాం. మామిడి పండ్లలో ఎన్ని పోషకవిలువలు ఉన్నయో.. ఆకుల్లో కూడా అనేక ఔషధగుణాలు దాగున్నాయి. మామిడి ఆకుల్ని శుభ్రంగా కడిగి.. మరిగే నీటిలో వేసి, కషాయంగా తాగితే.. శరీరంలోని వ్యర పదార్థాలు కడిగేసినట్లు తొలగిపోతాయి. శ్వాసకోశ సమస్యలకు ఈ ఆకుల కషాయం చక్కటి మందుగా పనిచేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లున్నా కరిగిపోతాయి. అజీర్తి, మానసిక ఒత్తిడి, రక్త విరేచనాలు, చర్మ వ్యాధులు వంటివి రావు.


Untitled-2 copy.jpg

కరవీర పత్రం: గన్నేరు పత్రానికి మరోపేరు కరవీర. దీనికి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలు పూస్తాయి. వినాయక పూజలో ఈ పూలకు విశిష్టస్థానం ఉంది. అయితే గన్నేరు పువ్వులు, ఆకుల్ని వైద్యుల సహాయంతోనే వాడాలి. ఇవి విషానికి విరుగుడుగా పనిచేస్తాయి. మోతాదుకు మించి వాడితే విషం కూడా. అందుకని ఆయుర్వేద వైద్యుల సలహాలతోనే వీటిని తీసుకోవాలి.


Untitled-2 copy.jpg

మరువక పత్రం: దీనికి వాడుక భాషలో ధవనం అని పేరు. ఆకులు ఎండిన తర్వాత కూడా మంచి సువాసన వెదజల్లడం ఈ పత్రం ప్రత్యేకత. దీనిని సుగంధ ద్రవ్యాలలో, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.


Untitled-2 copy.jpg

విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందింపజేయడానికి ఉపయోగిస్తారు.


Untitled-2 copy.jpg

శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు.జమ్మి ఆకుల కషాయం తాగితే.. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం, ఆయాసం, దగ్గు, జలుబు వంటివన్నీ తగ్గుముఖం పడతాయి. పలు ఆయుర్వేద ఔషధాల్లోనూ ఈ వృక్ష సంబంధిత భాగాలను వాడతారు. చర్మ వ్యాధులకు కూడా ఇది చక్కటి మందు.


Untitled-2 copy.jpg

సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా పిలుస్తుంటారు. వావిలి ఆకుల్ని కొబ్బరినూనెలో మరిగించి.. ఆ నూనెను నిల్వ చేసుకుంటారు. మోకాళ్ల నొప్పులకు ఈ నూనె ఉపశమనం ఇస్తుంది. ఈ ఆకులను ఆవునెయ్యిలో వేయించి తింటే ముక్కులో నుంచి రక్తం కారడం ఆగుతుంది. వావిలి ఆకుల్ని బాగా నూరి రసం తీసి.. అందులో నువ్వుల నూనె కలిపి వేడి చేయాలి. అది చల్లారిన తరువాత దాన్ని గజ్జి, తామర, దద్దుర మీద ప ్లట్టిస్తే పోతాయి. వావిలి ఆకుల కషాయాన్ని పాలతో కలిపి తీసుకుంటే మలేరియా జ్వరం తొలగుతుంది.


Untitled-2 copy.jpg

అశ్వతథ పత్రం: హిందువులు, బౌద్ధులు, జైనులు ఎంతో పవిత్రంగా పూజించే వృక్షం ఇది. రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టును పూజించడం హైందవ సంప్రదాయం. దీనిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తులు ఉంటారని నమ్మకం. రావి చెట్టు ఆకులు సమృద్ధిగా ప్రాణవాయువును అందిస్తాయి. రావి చిగుళ్లను పాలలో ఉడికించి తాగితే.. మెదడు చైతన్యవంతం అవుతుంది. రావి పండ్లుతింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.


Untitled-2 copy.jpg

దాడిమీ పత్రం: దాడిమీ అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీ ఫల నైవేద్యం ఎంతో ఇష్టం. దానిమ్మ ఆకులు, పువ్వులు, మొగ్గలు, బెరడు ఇలా ప్రతిదీ ఔషధమే. దానిమ్మ త్రిదోషాలను నివారిస్తుంది. హెచ్చుతగ్గులు కాకుండా సమతుల్యంగా ఉంచుతుంది. జఠరాగ్నిని ప్రేరేపించి గుండెకు మేలు చేస్తుంది. కడుపులో గ్యాస్‌, అల్సర్లకు దానిమ్మను మించిన ఔషధం లేదని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. చెడు కొవ్వును తగ్గించి, గుండె జబ్బులు రాకుండా కాపాడటంలో దానిమ్మరసం అన్నిటికంటే శ్రేష్టమైనది.


Untitled-2 copy.jpg

అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. ఈ చెట్టు బెరడులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం ఉంటాయి. ఈ చెట్టు బెరడును కాల్చి.. పాలలో కలిపి తాగితే గుండె జబ్బులు తగ్గుతాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల.. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ బెరడు చూర్ణాన్ని తేనెలో కలిపి.. ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి.


Untitled-2 copy.jpg

దేవదారు పత్రం: ఇది అడవుల్లోనే పెరుగుతుంది. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ కలపతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉట్టిపడుతుంటుంది. ఎండిన చెట్టు కొమ్మలు కాలిస్తే.. సాంబ్రాణిలా మంచి వాసన వస్తుంది. ఈ చెట్టు బెరడు అజీర్తి, జీర్ణ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి జబ్బుల్ని తగ్గిస్తుంది.


Untitled-2 copy.jpg

బిల్వ పత్రం: బిల్వ పత్రానికి మరోపేరు మారేడు. మూడు ఆకులు కలిసి ఉంటాయి. వీటిని శివుడికి, మహలక్ష్మీకి అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. మారేడులో పీచు పదార్థం ఎక్కువ. మలబద్దకాన్ని తొలగిస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. మారేడు ఆకులు, కాయలు, వేర్లు వంటివన్నీ ఔషధాలే! మారేడు కాయల లోపలి గుజ్జు ను చక్కెరతో కలిపి తీసుకుంటే పేగు పూత తగ్గుతుంది. కడుపులోని అల్సర్లు కూడా పోతాయి. ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఆకుల కషాయం తాగితే విరేచనాల నుంచి బయట పడొచ్చు. జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడంలో మారేడును మించిన చెట్టు మరొకటి లేదు.


Untitled-2 copy.jpg

గండలీ పత్రం: దీనినే లతాదూర్వా అని కూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది. మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, నులి పుురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.


Untitled-2 copy.jpg

అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందన్నది ఓ నమ్మకం. చర్మ వ్యాధులు, సెగడ్డలు, కీళ్ళ నొప్సులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు, వ్రణాలు తగ్గించడానికి ఔషధంగా పనిచేస్తుంది.

Updated Date - Sep 07 , 2024 | 01:36 AM