Share News

Srikanth: అదృష్టం అంటే ఇదే కదా అనిపిస్తుంటుంది!

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:14 AM

తెలుగు చిత్రపరిశ్రమలో శ్రీకాంత్‌ వంటి అదృష్టవంతుడు మరెవరూ లేరని అంటుంటారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించడమే కాకుండా ఏనాడూ వివాదాల జోలికి పోకుండా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

Srikanth: అదృష్టం అంటే ఇదే కదా అనిపిస్తుంటుంది!

తెలుగు చిత్రపరిశ్రమలో శ్రీకాంత్‌ వంటి అదృష్టవంతుడు మరెవరూ లేరని అంటుంటారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించడమే కాకుండా ఏనాడూ వివాదాల జోలికి పోకుండా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. పరిశ్రమలో అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్న శ్రీకాంత్‌.. వచ్చే జనవరిలో విడుదల కానున్న గేమ్‌ ఛేంజర్‌ చిత్రంలో తన తండ్రిని పోలిన గెటప్‌తో నటిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ‘నవ్య’తో పంచుకున్నారు శ్రీకాంత్‌.

ముఫ్ఫై మూడేళ్ల కెరీర్‌.. 130కి పైగా చిత్రాలు.. ఎలా అనిపిస్తుంటుంది?

నిజం చెప్పాలంటే ఇన్నేళ్ల కెరీర్‌ను నేను ఊహించలేదు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది తప్ప ఇలా 30 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతానని అనుకోలేదు. నేనే కాదు బహుశా ఎవరూ అలా అనకోలేరేమో! పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌ చిత్రంలో తొలి అవకాశం దొరకడమే ఒక అదృష్టంలా భావించాను ఆ రోజు. ఎక్కడో ఒక గ్రామంలో పుట్టి పెరిగి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి రావడం, ఒక్కో మెట్టు ఎదుగుతూ 130 పైగా చిత్రాల్లో నటించడం.. ఎలా సాధ్యమైందా అని ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అదృష్టం అంటే ఇదే కదా అనిపిస్తుంటుంది.

కెరీర్‌ ఆరంభంలో మిమ్మల్ని గైడ్‌ చేసినవాళ్లు ఎవరైనా ఉన్నారా?

‘పీపుల్స్‌ ఎన్‌ కౌంటర్‌’ లో చేస్తుండగానే ‘మధురానగరిలో’ సినిమాలో నలుగురి హీరోల్లో ఒకరిగా అవకాశం వచ్చింది. ఆ సినిమా అయిన తర్వాత ఆరు నెలలు గ్యాప్‌. చాలా టెన్షన్‌ పడ్డా. ఇక ఇంటికి తిరిగి వెళ్లిపోవాల్సిందేనా అనుకున్నాను. అటువంటి తరుణంలో సీతారత్నంగారి అబ్బాయి’ చిత్రంలో అవకాశం వచ్చింది. కాకపోతే విలన్‌ వేషం. హీరోగా రెండు చిత్రాల్లో నటించి, ఇప్పుడు విలన్‌గా నటించాలా అనిపించింది. ఆ సమయంలో దర్శకుడు శరత్‌ నన్ను గైడ్‌ చేశారు. చిత్ర పరిశ్రమలో నిలబడడం ముఖ్యం. ఒకసారి పేరు వచ్చిన తర్వాత హీరో కావడం సులభమే’ అన్నారు. ఇక ఆలోచించకుండా సరే అనేశా. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. విలన్‌గా కొన్ని చిత్రాల్లో నటించి ఆ తర్వాత మళ్లీ హీరో అయ్యా. ఇప్పటికి 130కి పూగా చిత్రాలు పూర్తి చేశా. మధ్య మధ్యలో కింద పడ్డాను, మళ్లీ పైకి లేచాను. ‘అఖండ’ చిత్రం తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చి సెటిల్‌ అయ్యా. వస్తున్న క్యారెక్టర్స్‌ ఎంజాయ్‌ చేస్తూ నటిస్తున్నా. ఇంట్లో ఖాళీగా ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాల్సిందే. రిలాక్స్‌ మూడ్‌ అనేది ఇంకా రాలేదు. ప్రయాణం సాఫీగా సాగుతోంది. లక్కీగా ఇప్పుడు నాకు అన్నీ మంచి పాత్రలే వస్తున్నాయి.


yhl.jpg

ఎక్కువగా ట్రావెల్‌ చేస్తుంటారెందుకు?

నాకు ట్రావెలింగ్‌ అంటే బాగా ఇష్టం. ఫ్రెండ్స్‌తో కలసి తిరుగుతుంటాను. సాధ్యమైనంత వరకూ కారులో వెళ్లడానికే ప్రయత్నిస్తుంటా. ఇదివరకు అన్నీ జాలీ ట్రిప్పులే. గోవా, బ్యాంకాక్‌ ఇలా.. పదేళ్ల నుంచి రూట్‌ మార్చి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నాను. అమరనాథ్‌ యాత్ర, కేదార్‌నాథ్‌ వంటి కొన్ని ప్రదేశాలకు తప్ప. శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు.. అన్నీ చూసేశా. గత నెల కుటుంబంతో కలసి నేపాల్‌ వెళ్లి వచ్చాను. రుద్రాక్షలు మెళ్లో వేసుకుని నుదుటిన ఇంతింత బొట్లు, విభూతి పెట్టుకుని అక్కడి వీధుల్లో తిరుగుతుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు కాశీ, అయోధ్య వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నా. ఇంట్లో వాళ్లు మాత్రం కారులో ఎందుకు అని అంటున్నారు. కారులో వెళుతుంటే ఆ కిక్కే వేరు. మన తెలుగు రాష్టాల్లో చేయలేని పనులు అక్కడ స్వేచ్చగా చేయవచ్చు. దారిలో ఎక్కడన్నా చిన్న టీ కొట్టు కనపించిందనుకోండి... ఆగి తాపీగా టీ తాగవచ్చు. తెలియని ప్రదేశంలో మనల్ని గుర్తు పట్టేవాళ్లు ఎవరూ ఉండరు కదా. ఒకసారి లడఖ్‌ వెళ్లి కారులో తిరిగి వస్తున్నాం. చండీఘడ్‌ దాటిన తర్వాత రోడు పక్కన ఒక దాబా కనిపించింది. కారు అక్కడ ఆపుకొని, భోజనం చేసి అక్కడున్న నులక మంచాల మీద పడుకుని తెల్లారిన తర్వాత బయలుదేరి వచ్చేశాం. ఇదంతా థ్రిల్లింగ్‌గా అనిపించింది. జనం మనల్ని గుర్తు పట్టనప్పుడు ఏమైనా చేయవచ్చు.

భక్తి భావం ఎప్పటినుంచి మొదలైంది?

నాకు మొదటి నుంచీ ఉంది. పదేళ్ల నుంచి మరింత ఎక్కువైంది. గుళ్లో ఉన్నంతసేపూ మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకే కాదు... ఊహకి కూడా భక్తి ఎక్కువ. తరచూ ఇంట్లో పూజలు, హోమాలు చేయిస్తుంటుంది.

క్రికెట్‌ ఆటకు దూరమయ్యారా?

లేదు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వెళ్లి ఆడి వచ్చాం. సంగీత దర్శకుడు తమన్‌, తరుణ్‌... మేమంతా ఒక టీమ్‌. వచ్చే ఏడాది అమెరికాలో మ్యాచ్‌ ఉంది. దాని కోసం సన్నద్ధం అవుతున్నాం.


గేమ్‌ ఛేంజర్‌లో మీ నాన్నగారి గెటప్‌లో కనిపిస్తున్నారట!

ఆ సినిమాలో నాకు అవకాశం రావడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. కానీ మొదట కథ విన్న తర్వాత ఈ పాత్రకు నన్ను ఎందుకు అనుకున్నారా అనిపించింది. ఎందుకంటే అది వయసు పైబడిన పాత్ర. ముఖ్యమంత్రి పాత్ర. చాలా డెప్త్‌ ఉన్న వేషం.. నేను చేయగలనా అనిపించింది .కాకపోతే సెకండ్‌ ఆఫ్‌లో యంగ్‌ గెటప్‌ కూడా ఉంది. ఇది పాజిటివ్‌ కాదు, నెగెటివ్‌ కాదు. ఒక్కో సమయంలో ఒక్కోలా అనిపిస్తుంటుంది. ఇలాంటి పాత్ర చేసే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టమే. శంకర్‌ దర్శకత్వంలో నటించడం లక్కీనే కదా. అందులోనూ నాన్నగారి గెటప్‌లో కనపించడం మరింత ఆనందం కలిగించింది. ఆ గెటప్‌ ఎంతవరకూ సెట్‌ అవుతుందా అని భయపడ్డాను. ముంబైలో మేకప్‌ టెస్ట్‌ జరిగింది. ఆ గెటప్‌లో నన్ను చూసి శంకర్‌ చాలా సంతృప్తి చెందారు. ఎవరూ గుర్తు పట్టలేదు. అఖరికి మా అమ్మ కూడా. గెటప్‌ కుదిరితే నేను పాస్‌ అయినట్లే అనుకున్నాను. చాలా చక్కగా ఉంది. శంకర్‌ ఎలా చెబితే అలా నటించా.

మీ ముగ్గురు పిల్లల్లో ఒకరు హీరో. మిగిలిన వారి సంగతి?

పాప కెనడాలో చదువుతోంది. రెండో అబ్యాయి టెన్త్‌ చదువుతున్నాడు. పెద్ద అబ్బాయి రోషన్‌ కంటే వాళ్లిద్దరూ బాగా చదువుతారు.

మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? మీదా.. ఊహదా?

ఇంటి విషయాల్లో ఆవిడదే పెత్తనం. డబ్బు తెచ్చి ఇవ్వడమే నా పని. పిల్లల చదువుల దగ్గర నుంచీ అన్నీ తనే చూసుకుంటుంది.

ఆవిడ సినిమాల్లో నటించకూడదని కండిషన్‌ పెట్టారా?

అదేమీ లేదండీ. పెళ్లయిన తర్వాత నటన వద్దని తనే అనుకుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఆ నిర్ణయానికి మరింత కట్టుబడింది. ముగ్గురు పిల్లలను పెట్టుకుని మేం ఇద్దరం సినిమాల్లో నటించడం కరెక్ట్‌ కాదుగా. మధ్యలో కొందరు అడిగిరు కానీ తనే చేయనని చెప్పేసింది. నేను నటించే సినిమాల వేడుకలకు కూడా ఆమె రాదు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా?

నాకు అకౌంట్స్‌ ఉన్నాయి కానీ అరుదుగా పోస్టులు పెడుతుంటాను. వివాదస్పద విషయాలకు దూరంగా ఉంటాను. వాటి గురించి తెలుసుకుంటాను కానీ ఎక్కడా కామెంట్‌ చేయను.

వినాయకరావు


మీ కారు నంబర్‌, ఫోన్‌ నంబర్‌.. అన్నీ ఫ్యాన్సీగా ఉంటాయి. న్యూమరాలజీ మీద బాగా నమ్మకమా?

అలా ఏమీ లేదండీ. ఫ్యాన్నీ నంబర్లు అంటే ఇష్టం. అందుకే అలా ఉంటాయి. కానీ ఐదు అంకెకూ నాకూ ఏదో తెలియని అనుబంధం ఉందని చెప్పాలి. నా అదృష్ట సంఖ్య ఐదు అని చెబతారు. ఇంటి నంబర్‌ 23. అది కావాలని మనం అనుకున్నది కాదు. నా ఫోన్‌ నంబర్‌లో అంకెలన్నీ కలపితే ఐదు వస్తుంది. నా పేరులోని అక్షరాలు కలపితే ఐదు.

Updated Date - Dec 22 , 2024 | 01:15 AM