అమెరికాలో తెలుగు పాఠశాల
ABN , Publish Date - Jul 18 , 2024 | 04:11 AM
కొత్త జ్యోతిర్మయి... అమెరికాలో ఉచిత తెలుగు ‘పాఠశాల’ను ప్రారంభించారు. తెలుగులో మాట్లాడటం రాని అక్కడి పిల్లలతో ‘పెద్దబాల శిక్ష’ను కంఠస్తం చేయిస్తున్నారు. తెలుగులో రాయడం అసలే తెలియని చిన్నారులతో సొంతూరులో ఉంటున్న వాళ్ళ బామ్మ, తాతయ్యలకు...
సంకల్పం
కొత్త జ్యోతిర్మయి... అమెరికాలో ఉచిత తెలుగు ‘పాఠశాల’ను ప్రారంభించారు. తెలుగులో మాట్లాడటం రాని అక్కడి పిల్లలతో ‘పెద్దబాల శిక్ష’ను కంఠస్తం చేయిస్తున్నారు. తెలుగులో రాయడం అసలే తెలియని చిన్నారులతో సొంతూరులో ఉంటున్న వాళ్ళ బామ్మ, తాతయ్యలకు ఉత్తరాలు రాయిస్తున్నారు. తెలుగునేల మీద మాతృభాషకు వన్నె తగ్గినా, పరాయి దేశంలో తెలుగు వెలుగులు పూయిస్తున్నారు. అగ్ర రాజ్యంలో పుట్టిన పిల్లలకు తెలుగు ఉగ్గు పడుతున్న జ్యోతిర్మయి పదిహేనేళ్ళ ‘పాఠశాల’ అనుభవాలను నవ్యతో పంచుకున్నారిలా...
పదిహేనేళ్ళ కిందట షార్లెట్ నగరంలో మేము నెలకొల్పిన ‘పాఠశాల’ ఇప్పుడు డెట్రాయిట్, కొలంబియా తదితర ప్రాంతాల్లో 32 తెలుగు బోధనా తరగతులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో పుట్టి పెరిగిన ఆరువేల మందికిపైగా విద్యార్థులకు తెలుగులో మాట్లాడటం, రాయడం, చదవడం నేర్పించాం. కేవలం మాతృ భాష మీద మమకారంతో ఒక్క డాలరు కూడా ఫీజు తీసుకోకుండా, దీన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 250 మందికిపైగా విద్యార్థులు మా పాఠశాలలో తర్ఫీదు పొందుతున్నారు. నాతో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు ఉపాధ్యాయులు, ఇతర అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అంతా కలిపి డెభైమందికిపైగా పని చేస్తున్నారు. వారంతా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఎన్నో కష్టాలు, మరెన్నో సవాళ్ళను దాటుకుంటూ... ఇన్నేళ్ళుగా పాఠశాల సేవలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయంటే అదంతా వారందరి సమష్టి కృషి ఫలితమే.!
ఆ సంఘటనే ప్రేరణ...
‘పాఠశాల’ ప్రారంభించడం వెనకున్న కారణం ఏమిటంటే, మాకు పొరగున ఉండే నా స్నేహితురాలి అమ్మానాన్న ఇండియా నుంచి వచ్చారని తెలిసి, ఒక రోజు వారింటికి వెళ్లాను. ఆరు నెలలు ఉందామని వచ్చిన ఆ పెద్దలు నెలరోజులకే తిరుగు ప్రయాణంకాడానికి సమాయత్తమవడం చూసి, అదేంటి అప్పుడే వెళుతున్నారు అని అనడిగాను. ‘‘మనవడు, మనవరాలితో గడపాలని గంపెడాశతో వచ్చాం. కానీ వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకు రాదు. పిల్లలను ముద్దుచేయబోతే కనీసం దగ్గరకు కూడా రావడంలేదు. మమ్మల్ని పరాయి వాళ్ళను చూసినట్టు చూస్తున్నారు’’ అంటూ బాధపడ్డారు. వారి ఆవేదన నా మనసును బాగా మెలిపెట్టింది. అమ్మమ్మ, నాయనమ్మల ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించడంలోని ఆనందం మరెందులోనూ దొరకదు కదా.! అది ఈతరానికి అందకుండా పోవడం నిజంగా బాధాకరమే. మరీ ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు కుటుంబాల్లోని చాలామంది పిల్లలు భాష సమస్య వల్ల బామ్మ, తాతయ్యల అనురాగానికి నోచుకోలేకపోవడం గమనించాను. ఆ లోటు పూడ్చడానికి నా వంతుగా 2019లో మా ఇంటిలోనే ‘పాఠశాల’ తెలుగు బోధన ప్రారంభించాను. కొద్దిరోజులకు అది ఇతర ప్రాంతాలకు విస్తరించింది.
ఇంటిలోనే పాఠశాల...
పాఠశాల ఒకే చోట ఉంటే, దూరప్రాంతాల నుంచి పిల్లల రాక, పోకలకు ఇబ్బంది అవుతుందని, నైబర్‌హుడ్ స్కూలింగ్ విధానాన్ని ఆశ్రయించాం. విద్యార్థులకు సులువుగా ఉండేలా, వాళ్ళ కాలనీలోనే ఒకరి ఇంట్లో పాఠశాల తరగతులు బోధించడం మొదలుపెట్టాం. ఈ సంగతి తెలిసి చుట్టు పక్కల వారంతా చేరడం మొదలుపెట్టారు. దాంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి చేరువయ్యాం. తరగతి గదిలో ప్రతి ఆరుగురు విద్యార్థులకు ఒక టీచర్ ఉంటారు. తెలుగు అంటే అమితాభిమానం కలిగినవారిని గుర్తించి, శిక్షణ ఇచ్చాం. ఇప్పటికీ ప్రతి ఏటా ఉపాధ్యాయులకు బోధనా పద్ధతులమీద శిక్షణా శిబిరాలు నిర్వహి స్తుంటాం. వారంతా స్వచ్ఛందంగా సేవ లందిస్తున్నారు.
అదంతా ఉపాధ్యాయుల గొప్పతనం
ప్రతి ఆదివారం ఒక గంట పాటు విద్యార్థులకు తరగతులుంటాయి. ఆ సమయంలోనే విద్యార్థులకు వారంలో నాలుగురోజులకు సరిపడా హోంవర్క్‌ను కూడా ఇస్తాం. పాఠశాలలో చేర్పించడంతో సరికాదు, కచ్చితంగా పిల్లలతో హోమ్‌వర్క్ చేయించాలన్న షరతు మీద అడ్మిషన్ ఇస్తాం. హోమ్‌వర్క్ అంటే తెలుగు పదాలు రాయడం, చిన్న సంఘటన మీద ఇంట్లో సంభాషించడం లాంటివన్నమాట. ఏడాది మధ్యలో మానేయడం, సమయానికి తరగతులు నిర్వహించలేకపోవడం లాంటివి చేయకూడదని మా ఉపాధ్యాయులతో ముందే ఒప్పందం కుదుర్చుకుంటాం. పాఠశాల వార్షికోత్సవం సమయంలో మేమంతా ఒకచోట కలుస్తాం. అంతవరకు వారు పిల్లలు నేర్చుకున్న భాషానైపుణ్యాలను ఆ సమయంలో నాటకాలు, పాటలు లాంటి వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శిస్తారు.
వారి మాటలతో ఆత్మసంతృప్తి...
మా సొంతూరు ఒంగోలు. మా నాన్న బాలకృష్ణారెడ్డి గారు కవి, రచయిత కూడా కావడంతో మొదటి నుంచి ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. ఆయన చదివిన ప్రతి పుస్తకంలో... తనకు నచ్చిన వాక్యాలను నాకు చదివి వినిపించేవారు. అలా గణిత శాస్త్ర విద్యార్థిని అయిన నాకు చిన్ననాటి నుంచి తెలుగు సాహిత్యంతోనూ పరిచయం ఏర్పడింది. నా భర్త రఘునాథ్ తెలుగు కథలన్నా, నవలలన్నా ఇష్టంగా చదువుతారు. ఆయనతో పాటు మరెంతోమంది స్నేహితుల సహకారంతో దీన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నాం. ఇండియాలోని బామ్మ, తాతయ్యలకు ఉత్తరాలు రాయడాన్ని సిలబ్‌సలో భాగంచేశాం. వ్యవహారిక పదాలను నేర్పిండంలో భాగంగా వారితో ఫోన్‌లో సంభాషించడాన్ని ప్రోత్సహిస్తున్నాం. దాంతో వారిలో మంచి మార్పును చూడగలిగాం. ఇదివరకు ఊరు వెళితే పరాయి దేశానికి వెళ్లినట్టు ఉండేది, ఇప్పుడు సొంతూరుకు వెళ్లినట్టు ఉంటుందని పిల్లలు చెబుతున్నప్పుడు... వారి అమ్మమ్మ, నాయనమ్మలతో గడిపిన విషయాలను మాతో పంచుకుంటున్నప్పుడు .... అవి వింటుంటే కలిగే ఆత్మసంతృప్తి, ఆనందం మాటలకు అందనది.
సాంత్వన్
సస్పెన్స్ థ్రిల్లర్ కథలు కావాలన్నారు...
పిల్లలకు తెలుగు నేర్పించడాన్ని బాధ్యతగా గాక, మన భాష పట్ల వారికి ఆసక్తి కలిగేలా శిక్షణ ఇస్తాం. అదే మా బోధనా పద్ధతి. పంచతంత్ర కథలు చెబుతున్నప్పుడు, మాకు అవి ఆసక్తిగాలేవని చాలామంది పిల్లలు అన్నారు. పైగా హాస్య కథలు కావాలని అడిగారు. వారి అభిరుచికి అనుగుణంగా ‘చిట్టి తల్లికథలు’ రాశాను.
తాతయ్య మాటలంటే ఇష్టం...
ఒకటి నుంచి నాల్గో తరగతి వరకు మా ‘పాఠశాల’లో తెలుగు పాఠాలు బోధిస్తున్నాం. దానికి అవసరమైన పాఠ్య ప్రణాళికలను మేమే తయారు చేసుకుంటాం. ఏడాదికి నాలుగు పరీక్షలు నిర్వహిస్తాం. వార్షిక పరీక్షలో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం ఆధారంగానే వాళ్ళను తర్వాత తరగతికి పంపిస్తాం. మా పాఠ్యాంశాలలో కుల, మత పరమైన ఆచారాలు, సంప్రదాయాలకు, విశ్వాసాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మొదటి నుంచి జాగ్రత్తపడుతున్నాం. వాటి అనుబంధ సంస్థలు వేటితోనూ సంబంధం లేకుండా ‘పాఠశాల’ను స్వతంత్రంగా నిర్వహిస్తున్నాం. మేము రూపొందించిన సిలబ్‌సను కేతు విశ్వనాథరెడ్డి గారిలాంటి విద్యావేత్తలు కొనియాడటం మరిచిపోలేని విషయం. గత వారం బాలల వ్యక్తిత్వ వికాస నిపుణుడు సీఏ ప్రసాద్ గారితో రెండు రోజులు తెలుగు బోధనా వర్క్‌షాప్ నిర్వహించాం. ఆ ముగింపు కార్యక్రమంలో ఓ ఆరేళ్ళ చిన్నారి అచ్చ తెలుగులో ‘‘నాకు ఇడ్లి ఇష్టం, అంతకన్నా దోసె ఇష్టం, వాటికన్నా బర్గర్ ఇష్టం... వాటన్నింటికన్నా నాకు ఈ తాతయ్య మాటలంటే ఇంకా ఇష్టం’’ అంటూ ఆయన్ను హత్తుకుంది. అది చూసి మేమంతా నిర్ఘాంతపోయాం. అమెరికాలో పుట్టిన పిల్లలకు తెలుగుపట్ల ఉన్న మమకారానికి ఈ సంఘటన ఒక నిదర్శనం.