Tana: మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం
ABN , Publish Date - Apr 01 , 2024 | 10:13 PM
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా.. ఆదివారం నిర్వహించిన 66వ సాహిత్య సమావేశం ‘‘మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే కార్యక్రమం ఘనంగా, విజ్ఞానదాయకంగా జరిగింది.
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా.. ఆదివారం నిర్వహించిన 66వ సాహిత్య సమావేశం ‘‘మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే కార్యక్రమం ఘనంగా, విజ్ఞానదాయకంగా జరిగింది.
ఈ సందర్భంగా.. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విజ్ఞానశాస్త్రంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ప్రముఖులు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అంటూ అతిథులందరినీ ఆహ్వానిస్తూ సభను ప్రారంభించారు.
అనంతరం ఈ వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ఎన్నో వేల సంవత్సారల క్రితమే ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, ఆయుర్వేదశాస్త్రం, వృక్షశాస్త్రం, శిల్పశాస్త్రం, శబ్దశాస్త్రం, కాలశాస్త్రం లాంటి అనేక శాస్త్రాలకు పుట్టినిల్లు అఖండ భారతదేశం. ఎంతోమంది వీరులకు, శూరులకు, శాస్త్రవేత్తలకు, పండితులకు నిలయమై.. నలంద, తక్షశిలల లాంటి విశ్వవిద్యాలయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి ఒక గొప్ప విజ్ఞానగనిగా విరాజిల్లిన ఘనచరిత్ర కలిగిన భారత మూలాలపై ఇంకా ఎంతో పరిశోధన జరగాల్సి ఉంది’’ అని అన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పూర్వ సంచాలకులు, చంద్రయాన్-3 కీలక శాస్త్రవేత్త డా. జోశ్యుల అచ్యుత కమలాకర్ తన ప్రసంగంలో.. ‘‘ఇప్పటివరకు ఇస్రో సాగించిన ప్రయోగాలు, సాధించిన విజయాలు, గత సంవత్సరం ప్రపంచంలోనే మొదటిసారిగా చంద్రుని దక్షిణ ద్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ ఉండడం, చంద్రునిపై నీరు ఉన్నదని మొదటిసారిగా కనుగొన్న దేశం భారతదేశం కావడం, అతి తక్కువ వ్యయంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచంలోనే మొదటి 5 దేశాల్లో ఒకటిగా భారతదేశం ఉండగలగడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం’’ అని అన్నారు. 30 నిమిషాలకు పైగా సాగిన తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో.. ఇస్రో త్వరలోనే చేపట్టబోయే అనేక ప్రయోగాలతో సహా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుని అందరినీ ఆకర్షించారు.
విశిష్ట అతిథిగా హాజరైన ప్రఖ్యాత రచయిత, సైన్స్ ప్రచారానికి విశేష కృషి చేస్తున్న ఆకాశవాణి పూర్వ ఉన్నతోద్యోగి డా.నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ.. “మన ప్రాచీన భారతీయ వాంగ్మయ విషయాలను సరిగా అర్థం చేసుకోవడం, వాటిని సరైన అవగాహనతో ప్రపంచంలోని అనేక ఇతర భాషల్లోకి అనువదించవలసిన ఆవశ్యకత, ముఖ్యంగా విజ్ఞానశాస్త్ర పరివ్యాప్తికి ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేసి యువతరంలో చైతన్యం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ రచయిత, విశ్రాంత అధ్యాపకులు, అనేక సైన్స్ సదస్సులు, సైన్స్ ప్రసంగాలు చేసిన డా. ప్రతాప్ కౌటిల్య తన ప్రసంగంలో.. బాల్యం నుంచే విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి కలిగేలా కొన్ని చిన్న చిన్న ప్రయోగాలతో అభిరుచి కల్పిస్తే, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు తయారవుతారన్నారు.