Share News

BRS: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు.. ఢిల్లీ పెద్దలతో కేటీఆర్, హరీష్ చర్చలు..?

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:48 PM

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్‌లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది..

BRS: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు.. ఢిల్లీ పెద్దలతో కేటీఆర్, హరీష్ చర్చలు..?

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్‌లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌లోకి (Congress) ఇప్పటికే ఆరేడుగురు ఎమ్మెల్యేలు జంప్ అవ్వగా.. మరికొందరు క్యూలో ఉన్నారు. ఇక ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగిపోవడం బీఆర్ఎస్‌కు ఊహించని పరిణామం. ఇవన్నీ ఒకఎత్తయితే.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకట్రెండు రోజుల్లో గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారని సమాచారం. పార్టీని ఏదో ఒకటి చేసి గాడిన పెట్టాలని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనుకున్న ప్రతిసారీ వరుస ఎదురుదెబ్బలే తగులుతుండటం గమనార్హం.


bjp.jpg

అసలేం జరిగింది..?

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కూడా షురూ చేసింది. లోక్‌సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని తెలియవచ్చింది. కమలం గూటికి నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేరుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ విలీన ప్రక్రియ ఉంటుందని తెలియవచ్చింది.


BRS-Ministers.jpg

ఢిల్లీ పెద్దలతో హరీష్, కేటీఆర్!

విలీనంపై ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు (KTR, Harish Rao) ఒప్పందం చేసుకున్నట్లు బీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. ఇవాళ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతా ఓకే అనుకుంటే ఒకట్రెండు రోజుల్లో విలీనం జరుగుతుందని సమాచారం. ఈ విలీనం తర్వాత ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్య సభలో పార్థసారథి రెడ్డి, దామోదర్‌రావు, సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి కేవలం ఇద్దరు రేణుఖ చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లు మాత్రమే రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీలును చేర్చుకోవడానికి మంతనాలు చేస్తున్నట్లు ముందే పసిగట్టిన బీఆర్ఎస్.. తమ ఎంపీలను కాంగ్రెస్‌లో చేరకుండా హైకమాండ్ ఎత్తుగడ వేసిందని తెలుస్తోంది. సో.. ఇదే జరిగితే బీఆర్ఎస్ బలం ఢిల్లీలో సున్నా అన్న మాట.

Updated Date - Jul 12 , 2024 | 12:49 PM