Mandipalli Ramprasad Reddy: రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఎలా దక్కింది.. ఈయన వెనుక ఉన్నదెవరు !?
ABN , Publish Date - Jun 13 , 2024 | 11:16 AM
మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి.. (Mandipalli Ramprasad Reddy) అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం..విధేయతను చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని. సమగ్రతను కాపాడుతానని.. బుధవారం విజయవాడలో జరిగిన చంద్రబాబునాయుడు మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో.. ప్రమాణం చేసిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డే.. ఉమ్మడి కడప జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలలో అదృష్టవంతుడు..
ఆ అదృష్టవంతుడు.. రాముడే..
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక.. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు
రాయచోటి తొలి మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి రికార్డు
కలిసొచ్చిన దూకుడు స్వభావం
సంబరాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు
మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి.. (Mandipalli Ramprasad Reddy) అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం..విధేయతను చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని. సమగ్రతను కాపాడుతానని.. బుధవారం విజయవాడలో జరిగిన చంద్రబాబునాయుడు మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో.. ప్రమాణం చేసిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డే.. ఉమ్మడి కడప జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలలో అదృష్టవంతుడు.
అమాత్యయోగం..!
గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాలలో మదనపల్లె, పీలేరు, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు సాధించింది. దీంతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబు క్యాబినెట్‌లో స్థానాన్ని ఆశించారు. ఎవరికి వాళ్లు తమకు తోచిన మార్గంలో ప్రయత్నాలు చేశారు. దీంతో చంద్రబాబు మంత్రివర్గంలో స్థానాన్ని దక్కించుకునే అదృష్టవంతుడు ఎవరా? అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చేశారు. ఆ ఎదురు చూపులకు తెరపడుతూ రాంప్రసాద్‌రెడ్డిని అమాత్యయోగం.. వరించింది.
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కుటుంబం సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. రాంప్రసాద్‌రెడ్డి తండ్రి మండిపల్లె నాగిరెడ్డి సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. గంట గుర్తుపైన గెలిచిన ఆయన తర్వాత గంటా నాగిరెడ్డిగా ఈ ప్రాంతంలో సుపరిచితుడు. మండిపల్లె నాగిరెడ్డి 1985, 1989లో రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1992లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన వరుసకు సోదరుడు అయిన నారాయణరెడ్డి ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ నారాయణరెడ్డి విజయం సాధించారు. 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రాంప్రసాద్‌రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్టును ఆశించారు. అయితే అప్పట్లో టికెట్టు రాలేదు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత వైసీపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఆ తర్వాత అధికార పార్టీలో ఇమడలేక ఇంకా మూడు సంవత్సరాలు అధికారం ఉన్నప్పటికీ వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో టికెట్ల విషయమై గట్టి పోటీ ఉన్నప్పటికీ 2024 ఎన్నికల్లో టికెట్టు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికే మూడు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీకి కంచుకోట లాంటి రాయచోటిలో టీడీపీ జెండా ఎగురవేసి రికార్డు సృష్టించారు.
మొట్టమొదటి మంత్రిగా రికార్డు
1951లో రాయచోటి నియోజకవర్గం ఏర్పడింది. 1952లో జరిగిన ఎన్నికల్లో తొలి ఎమ్మెల్యేగా కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరపున స్వాతంత్య్ర సమరయోధుడు యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో 9 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో సుగవాసి పాలకొండ్రాయుడు, మండిపల్లె నాగిరెడ్డితో పాటు గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా ఉన్నారు. వీరిలో పలువురు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయినా మంత్రియోగం దక్కలేదు. అయితే అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఉన్నప్పటికీ చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టిలో ఉన్న రాంప్రసాద్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది.
కలిసొచ్చిన దూకుడు స్వభావం
ఇప్పుడు అందరి నోటా.. వినిపించేది ఒకే మాట.. దూకుడు స్వభావం కలిగిన రాంప్రసాద్‌రెడ్డి ఎలా ఎమ్మెల్యేగా గెలిచాడు...? మంత్రి పదవి ఏ విధంగా వచ్చింది.? దీనికి అతడి వర్గీయుల నుంచి సమాధానం.. ఒకటే.. దూకుడు స్వభావమే మా నాయకునికి కలిసొచ్చిందని.. ఇంకా అధికారం సుమారు రెండున్నర సంవత్సరాలు ఉండగానే అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన మొదటి నుంచీ కొంచెం దూకుడుగానే వ్యవహరించారు. చిన్నమండెం మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై ఓ కేసు విషయమై పోలీసుస్టేషన్‌ను కార్యకర్తలతో కలిసి ముట్టడించాడు. ఈ సంద ర్భంగా అప్పుడు ఆయనపై కేసు నమోదైంది. అటువంటి సంఘటనలే ఇంకా ఒకటి రెండు జరిగాయి. తర్వాత గత ఏడాది ఆగస్టులో అంగళ్లు, పుంగనూరులలో టీడీపీ అధినేత చంద్రబాబుపైన మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీలు బాహాబాహికి దిగారు. ఈ గొడవల్లో రాంప్రసాద్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నాడు. దీంతో ఇతనిపైన హత్యాయత్నం కేసు నమోదైంది. ఇటువంటి సంఘటనల వల్ల చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టిలో పడ్డారు. ఈ నేపధ్యంలో.. రాయచోటి ఎమ్మెల్యే టికెట్టును రాంప్రసాద్‌రెడ్డికి కేటాయించారు.
సంబరాల్లో.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు
మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి దక్కడం పట్ల రాయచోటి ప్రాంత ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేకులు కట్ చేసి. స్వీట్లు పంచిపెట్టారు. రాంప్రసాద్‌రెడ్డి కార్యాలయం వద్ద పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్ ఏర్పాటు చేసి మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని తిలకించారు. వెనుకబడిన ప్రాంతమైన రాయచోటికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కడం.. ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు ఆశిస్తున్నారు. అనూహ్యంగా రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడం జిల్లా రాజకీయాల్లో సంచలనం కలిగించింది.
బయోడేటా
తండ్రి : మండిపల్లి నాగిరెడ్డి
తల్లి : సుశీలమ్మ
భార్య : హరితరెడ్డి
సంతానం : కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి,
కుమార్తె నాగ వైష్ణవిరెడ్డి
విద్యార్హత : పదో తరగతి వరకు కడపలోని నాగార్జున పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియట్ తిరుపతిలోని రాయలసీమ రెసిడెన్షియల్ కాలేజి, బెంగళూరులో బీడీఎస్ పూర్తి చేశారు.