Viral News: గోవులను తొక్కించుకునే సంప్రదాయం.. ఈ ఊరు ప్రత్యేకత తెలుసా
ABN , Publish Date - Oct 24 , 2024 | 02:52 PM
దేశంలోని అనేక ప్రాంతాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దసరా సందర్భంగా తెలంగాణాలో నిర్వహించే బతుకమ్మ, తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాతి సందర్భంగా నిర్వహించే కోళ్ల పందేలు.. ఇలాంటివి ఆయా ప్రాంతాల ప్రత్యేకతను, సంస్కృతిని చాటుతాయి.
భోపాల్: దేశంలోని అనేక ప్రాంతాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దసరా సందర్భంగా తెలంగాణాలో నిర్వహించే బతుకమ్మ, తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాతి సందర్భంగా నిర్వహించే కోళ్ల పందేలు.. ఇలాంటివి ఆయా ప్రాంతాల ప్రత్యేకతను, సంస్కృతిని చాటుతాయి. దీపావళి వచ్చిందంటే చాలు మధ్యప్రదేశ్(Madyapradesh)లోని ఓ గ్రామం సైతం ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని(Ujjain) జిల్లా కేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో బద్‌నగర్ తహసీల్ లో భిదావద్(Bhidavad) అనే గ్రామం ఉంది. అక్కడ ఏళ్లుగా ఓ సంప్రదాయం(Unique Tradition) ఉంది.
దీపావళి(Diwali) పండుగైన మరుసటి రోజు ఉదయం భక్తులు వినూత్నంగా తమ మొక్కు తీర్చుకుంటారు. గ్రామంలో ఉదయం పూట గోవులకు పూజలు నిర్వహించి వాటి ముందు పడుకుంటారు. గ్రామస్థులు గోమాతలను(Cows) భక్తులపై నుంచి తీసుకెళ్తారు. 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతలు గోవుల్లో ఉంటారని.. అవి తమపై నడిస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల(Devotees) నమ్మకం. ఇదే కాకుండా దీపావళి అయ్యాక 5 రోజులపాటు ఆ గ్రామస్థులు ఉపవాసం ఉంటారు. దీపావళి ఒక రోజు ముందు రాత్రంతా గ్రామ దేవాలయంలో(Gods) భజనలు, కీర్తనలు చేస్తారు. రెండో రోజు పూజలు నిర్వహిస్తారు. ఆపై డప్పుచప్పులతో గ్రామంలో ప్రదక్షిణలు చేస్తారు.
అనంతరం గోవులన్నింటినీ ఒక చోట చేర్చి.. భక్తులు నేలపై పడుకుంటారు.ఇలా చేయడం తమ ఆచారమని గ్రామస్థులు చెబుతున్నారు. ఆవులు భక్తులపై నుంచి వెళ్లిన తరువాత వారు లేచి డప్పు వాయిద్యాలకు నృత్యాలు చేయడంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకుంటుంది. ఇలా చేయడంవల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుకనుచూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ సంప్రదాయ వేడుకలో భక్తులెవరికి పెద్దగా గాయాలు కావని స్థానికులు చెబుతున్నారు.
For Latest News and National News click here..