డిసెంబర్... నా లక్కీమంత్
ABN , Publish Date - Dec 01 , 2024 | 07:00 AM
‘పుష్ప- ది రైజ్’, ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్ హిట్లతో రష్మిక మందన్న నేషనల్ స్టార్‌గా మారింది. ‘సామీ’ అంటూ అందర్నీ కట్టిపడేసిన శ్రీవల్లి ‘పుష్ప- ది రూల్’లో ఎలా ఉంటుందా? అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంది.
‘పుష్ప- ది రైజ్’, ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్ హిట్లతో రష్మిక మందన్న నేషనల్ స్టార్‌గా మారింది. ‘సామీ’ అంటూ అందర్నీ కట్టిపడేసిన శ్రీవల్లి ‘పుష్ప- ది రూల్’లో ఎలా ఉంటుందా? అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొంది. దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో తీరిక లేనంతగా బిజీగా ఉన్న ఈ పాన్ ఇండియా స్టార్ ఇటీవల పంచుకున్న కబుర్లివి...
‘పుష్ప’ తొలిరోజు...
‘పుష్ప’ సెట్‌లో అడుగుపెట్టిన మొదటిరోజు.. బన్నీని కలుద్దామని ఆయన కోసం వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. కట్ చేస్తే... ఆయన ఎదురుగానే నిల్చొని ఉన్నారు. మేకప్, హెయిర్‌స్టైల్ వల్ల పుష్పరాజ్ గెటప్‌లో ఆయన్ని అస్సలు గుర్తుపట్టలేకపోయా. అచ్చంగా శ్రీవల్లి గెటప్‌లో, మేకప్ లేకుండా ఉన్న నన్ను కూడా ఎవరూ గుర్తుపట్టలేకపోయేవారు. కొంతమంది అయితే నేరుగా నా దగ్గరకే వచ్చి ‘రష్మిక ఎక్కడ’ అని అడిగేవారు. ఇలాంటి అనుభవం అదే తొలిసారి.
ఎంత బిజీగా ఉన్నా...
ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా వర్కవుట్స్ అస్సలు మిస్సవ్వను. మొదట్లో వర్కవుట్స్, ఆహార నియంత్రణ ఎవరికైనా చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అలవాటు చేసుకుంటే అద్భుతాలు గమనించొచ్చు. సహజంగానే ప్రయాణాలంటే నాకు చాలా ఇష్టం. కాస్త విరామం దొరికితే విదేశాల్లో వాలిపోతా.
మితిమీరితే ఊరుకోను
‘యానిమల్’ విడుదలయ్యాక నా గురించి చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఒక డైలాగ్ దగ్గర నా ఎక్స్‌ప్రెషన్ బాగాలేదని సోషల్ మీడియాలో విమర్శించారు. నటిగా అరంగేట్రం చేసినప్పటి నుంచి నాపై ఈ విమర్శల దాడి జరుగుతూనే ఉంది. మొదట్లో ఇలాంటివి చూసి బాధపడేదాన్ని. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అది మితిమీరితే మాత్రం నా స్టైల్‌లో ఘాటుగా స్పందిస్తా.
అద్దె కట్టలేక...
నా జీవితం పూలపాన్పేమీ కాదు. చిన్నతనంలో దుర్భరమైన పేదరికం అనుభవించా. నాన్న చేసిన వ్యాపారాలు ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోవడంతో కొన్నేళ్లపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో ఇంటిని నడిపించేందుకు నాన్న చాలా కష్టపడ్డారు. ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితికి వచ్చేశాం. దాంతో ఇల్లు ఖాళీ చేయమని యజమాని ఒత్తిడి పెట్టేవారు. అలా అద్దె కట్టలేక ప్రతీ రెండు నెలలకొకసారి ఇల్లు మారుతూనే ఉండేవాళ్లం.
కన్నీళ్లు ఆగలేదు
‘యానిమల్’లో రణ్‌బీర్‌ను కొట్టే సన్నివేశం నటిగా నాకొక సవాల్ అనిపించింది. ఆ సన్నివేశంలో భావోద్వేగాలు బలంగా పండాలని, చాలా సహజంగా సీన్ రావాలని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా చెప్పారు. కేవలం ఆ ఒక్క మాటే నేను గుర్తుపెట్టుకున్నా. ‘యాక్షన్’ అనగానే రణ్‌బీర్ మీద కేకలు వేస్తూ, కోపంతో అతడి చెంపపై కొట్టా. ‘షాట్ ఓకే’ అని దర్శకుడు చెప్పినా నా కన్నీళ్లు మాత్రం ఆగలేదు. బాగా ఏడ్చేశా. దాదాపు ఎనిమిది నిమిషాల నిడివి గల ఆ సన్నివేశాన్ని కేవలం సింగిల్ టేక్‌లో పూర్తి చేశా.
కలిసొచ్చిన సెంటిమెంట్
నాకు డిసెంబర్ నెలంటే చాలా సెంటిమెంట్. ఒకవిధంగా లక్కీమంత్. ఎందుకంటే నా తొలి సినిమా ‘కిరాక్ పార్టీ’ ఈ నెలలోనే విడుదలైంది. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్‌తో నటించిన ‘అంజనీపుత్ర’, ‘చమక్’ సినిమాలు డిసెంబర్‌లోనే వచ్చి, సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. జాతీయస్థాయిలో నాకు గుర్తింపు తీసుకొచ్చిన ‘పుష్ప- ది రైజ్’, ‘యానిమల్’ సినిమాలు సైతం డిసెంబర్‌లోనే విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఈ డిసెంబర్‌లో ‘పుష్ప- ది రూల్’, ‘చావా’ సినిమాలు విడుదలవుతున్నాయి.