Viral: ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థి జాబ్ వద్దన్నాడని.. హెచ్ఆర్ ఊహించని విధంగా..
ABN , Publish Date - Apr 16 , 2024 | 06:31 PM
ఇంటర్వ్యూకు వచ్చిన ఓ అభ్యర్థి తనకూ ఈ జాబ్ వద్దంటూ తిరస్కరించినందుకు ఓ హెచ్‌ఆర్ చేసిన పనిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్వ్యూకు వచ్చిన ఓ అభ్యర్థి తనకు ఈ జాబ్ వద్దంటూ తిరస్కరించినందుకు ఓ హెచ్‌ఆర్ చేసిన పనిపై నెట్టింట (Viral) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్ ఆర్ మూర్ఖంగా వ్యవహరించిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జాబ్‌ను తిరస్కరించిన అభ్యర్థి ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకోవడంతో ఇది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇటీవల ఆ అభ్యర్థి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. హెచ్ ఆర్ టీంకు చెందిన ఓ మహిళ అతడిని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగింది. కానీ, ఇంటర్వ్యూ మధ్యలోనే మహిళ తనకు ఆసక్తి లేనట్టు వ్యవహరించిందని అభ్యర్థి చెప్పుకొచ్చాడు. చాలా సేపు తన మొబైల్ ఫోన్ చూస్తూనే గడిపిందని, తనను నేరుగా చూస్తూ మాట్లాడేందుకు ఆసక్తి కనబరచలేదని అన్నాడు (HRs Email To Candidate After Job Interview Is Highly Demeaning).
ఆ తరువాత తాను ఇంటికొచ్చి ఆ జాబ్ గురించి చాలాసేపు ఆలోచించానని, చివరకు అది తనకు తగిన ఉద్యోగం కాదన్న నిర్ణయానికి వచ్చినట్టు అతడు చెప్పాడు. ఇదే విషయాన్ని చెబుతూ హెచ్ ఆర్ మహిళకు మెసేజ్ చేశానని చెప్పుకొచ్చాడు. కానీ మహిళ మాత్రం చాలా అమర్యాదకరంగా రిప్లై ఇచ్చిందని అతడు చెప్పాడు. తాను ఆఫీసు నుంచి బయటకు రాగానే మరో అభ్యర్థికి జాబ్ ఇచ్చేసినట్టు హెచ్ ఆర్ చెప్పిందని అతడు చెప్పాడు. అప్పటికప్పుడు వెళ్లిపొమ్మని చెబితే బాగుండదు కాబట్టి ఇంటర్వ్యూ కొనసాగించినట్టు చెప్పానని ఆమె అన్నట్టు అతడు తెలిపాడు. అంతేకాకుండా, ఆ జాబ్‌కు తాను తగిన వ్యక్తి కాదని ముందే అర్థమైందని ఆమె అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఆమె పంపించిన మెసేజీల స్క్రీన్ షాట్లకు కూడా షేర్ చేశాడు.
ఇవి చూసిన నెటిజన్లు హెచ్‌ఆర్ తీరును విమర్శించారు. ఆమెది చిన్న పిల్లమనస్తత్వంలా ఉందని అభిప్రాయపడ్డారు. జాబ్ ఆఫర్‌ను అభ్యర్థి తిరస్కరిస్తే సరే అని అక్కడితో వదిలేయాలి గానీ నీ జాబ్ వేరేవాళ్లకు ఎప్పుడో ఇచ్చేశాననటం, దాని కోసం ఓ సుదీర్ఘ మెసేజీ పెట్టడం హుందాగా లేదని వ్యాఖ్యానించారు. జాబ్‌లో చేరలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మరింత నరకం చూసుండేవాడివంటూ కొందరు కామెంట్ చేశారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి