Share News

Paris Olympics : మను మానిత్వం

ABN , Publish Date - Jul 31 , 2024 | 06:29 AM

కెరీర్‌లో కనీసం ఒక్క ఒలింపిక్‌ పతకమైనా దక్కించుకోవాలని ప్రతీ అథ్లెట్‌ తపిస్తుంటాడు. కానీ 22 ఏళ్ల యువ షూటర్‌ మను భాకర్‌ అంతకుమించే సాధించింది. రెండు రోజుల వ్యవధిలోనే రెండో కాంస్యంతో ఔరా.. అనిపించింది. నాలుగో రోజు మంగళవారం 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌

Paris Olympics : మను మానిత్వం
త్రివర్ణ పతాకంతో సరబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ అద్వితీయ మను

రెండో పతకంతో భాకర్‌ చరిత్ర

10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మూడో స్థానం

సరబ్‌జోత్‌తో కలిసి కాంస్యం కైవసం

యువ షూటర్‌ మను బాకర్‌ ఖాతాలో రెండో పతకం

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సరబ్‌జోత్‌తో కలిసి కాంస్యం

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్‌గా ఘనత

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకున్న అనంతరం మనుతో కలిసి స్వర్ణ, రజత పతక విజేతలతో సెల్ఫీ తీసుకుంటున్న సరబ్‌జోత్‌సింగ్‌

యువ షూటర్‌ మను మళ్లీ అద్భుతం చేసింది. రెండోసారి ఆమె ‘గురి’ అదిరింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని తానే అందించింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలుచుకున్న మను, అదే ఈవెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ సత్తాచాటింది. సహచర షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి కాంస్యం సాధించింది. స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా మను రికార్డు సృష్టించింది. 1900వ సంవత్సరంలో పారిస్‌ వేదికగానే జరిగిన విశ్వక్రీడల్లో ఆంగ్లో ఇండియన్‌ నార్మన్‌ ప్రిచార్డ్‌ 200 మీటర్ల స్ర్పింట్‌, 200 మీటర్ల హర్డిల్స్‌లో రెండు రజత పతకాలు గెలిచాడు. ఇప్పటికే రెండు పతకాలతో ఊపు మీదున్న మను.. మూడో ఈవెంట్‌ను ఆగస్టు 2న ఆడనుంది. పారి్‌సలో నాలుగోరోజు పోటీల్లో మను-సరబ్‌జోత్‌ కాంస్య పతకంతో చరిత్ర సృష్టిస్తే.. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో ఫేవరెట్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ మరో విజయంతో తమ గ్రూపులో టాపర్‌గా నిలిచింది. మన హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకోగా.. టేబుల్‌ టెన్ని్‌సలో మనికా బాత్రా ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించి పతకానికి చేరువైంది.

అంచనాలు తప్పలేదు.. మను భాకర్‌ మళ్లీ సాధించింది.. 2016, 2020 ఒలింపిక్స్‌లో ఎంత మంది షూటర్లు బరిలోకి దిగినా ఒక్క పతకానికీ నోచుకోలేకపోయారు. కానీ ఈసారి రెండు రోజుల వ్యవధిలోనే దేశ ప్రజల సంతోషాన్ని మను ‘డబుల్‌’ చేసింది. చరిత్రను తిరగరాస్తూ పాల్గొన్న రెండో ఈవెంట్‌లోనూ కాంస్యం పట్టేసింది. సహచర షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కొరియా అథ్లెట్లకు షాకిస్తూ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా స్వతంత్య్ర భారతావనిలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారిణిగా వహ్వా.. అనిపించుకుంది. మరోవైపు షూటింగ్‌ టీమ్‌ ఈవెంట్‌లోనూ దేశానికిదే తొలి పతకం.

పారిస్‌: కెరీర్‌లో కనీసం ఒక్క ఒలింపిక్‌ పతకమైనా దక్కించుకోవాలని ప్రతీ అథ్లెట్‌ తపిస్తుంటాడు. కానీ 22 ఏళ్ల యువ షూటర్‌ మను భాకర్‌ అంతకుమించే సాధించింది. రెండు రోజుల వ్యవధిలోనే రెండో కాంస్యంతో ఔరా.. అనిపించింది. నాలుగో రోజు మంగళవారం 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ కాంస్య పతక పోరులో మను భాకర్‌, సరబ్‌జోత్‌ సింగ్‌ జోడీ విజేతగా నిలిచింది. ఇది దేశానికి రెండో మెడల్‌ కాగా.. ఈ రెండింట్లోనూ 22 ఏళ్ల మను భాకర్‌ పాత్ర ఉండడం విశేషం. ఆదివారం మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మను కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు 22 ఏళ్ల సరబ్‌కిది తొలి ఒలింపిక్‌ మెడల్‌. ఇక షూటింగ్‌ విభాగంలో భారత్‌కిది ఆరో పతకం. మరోవైపు ఈ విభాగంలో సెర్బియాకు చెందిన జొరాన అరునోవిచ్‌-దామిర్‌ మికెక్‌ 16-14 తేడాతో తుర్కియే జోడీ సెవ్వాల్‌ టర్హాన్‌-యూసు్‌ఫపై గెలిచి స్వర్ణం సాధించింది. ఇదిలావుండగా మను భాకర్‌ శుక్రవారం జరిగే 25మీ. పిస్టల్‌ ఈవెంట్‌లోనూ పోటీపడనుంది.

సరబ్‌జోత్‌ అదుర్స్‌: కాంస్య పతక ప్లేఆ్‌ఫ్సలో మను-సరబ్‌జోత్‌ జోడీ 16-10 తేడాతో కొరియాకు చెందిన ఓహ్‌ యే జిన్‌-లీ వొనోహోలను ఓడించింది. ఈ కీలక పోరులో భారత జోడీ సమన్వయంతో ముందుకు సాగింది. ఒకరు వెనుకబడిన వేళ మరొకరు గురి తప్పకుండా పిస్టల్‌ను పేల్చడంతో పతకాన్ని దక్కించుకోగలిగారు. ముఖ్యంగా సరబ్‌ చివర్లో గురి తప్పని షాట్‌తో అదరగొట్టాడు. ఓపెనింగ్‌ షాట్‌ను మను 10.2తో దీటుగా ఆరంభించినా, సరబ్‌జోత్‌ 8.6తో జట్టు 18.8 పాయింట్లతో వెనుకబడింది. అటు కొరియన్స్‌ 20.5తో దూసుకెళ్లడంతో పాటు 2-0తో వారిదే పైచేయి అయ్యింది. కానీ ఆ తర్వాత పుంజుకున్న సరబ్‌ 10.5, 10.4, 10 స్కోరు కారణంగా టీమ్‌ ఆరు పాయింట్లను సొంతం చేసుకోగలిగింది. అటు మను భాకర్‌ తన తొలి ఏడు షాట్లలో ఇన్నర్‌ 10ను సాధించి తోడ్పాడునందించింది. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన ఓహ్‌ యే తన నిలకడైన ప్రదర్శనతో తమ జట్టును 2-8 నుంచి 10-14 పాయింట్లకు చేర్చి ఉత్కంఠ పెంచింది. అయితే ఫైనల్‌ షాట్‌లో యే జిన్‌ 9, లీ వొనొహో 9.5కి పరిమితమయ్యారు. తీవ్ర ఒత్తిడిలో మను 9.4 స్కోరు చేయగా అటు సరబ్‌జోత్‌ మాత్రం చక్కటి ఏకాగ్రతతో 10.2 స్కోరుతో కాంస్యాన్ని ఖాయం చేశాడు. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్స్‌లో మొదట ఏ జోడీ 16 పాయింట్లు సాధిస్తుందో వారే విజేతలుగా నిలుస్తారు.

నిరాశపరిచిన పృథ్వీరాజ్‌: పురుషుల ట్రాప్‌ అర్హత పోటీల్లో పృథ్వీరాజ్‌ తొండైమాన్‌ 21వ స్థానంలో నిలిచాడు. రెండు రోజుల పాటు జరిగిన ఐదు రౌండ్స్‌లో తను 118/125 స్కోరు సాధించాడు. ఈ ఈవెంట్‌లో టాప్‌-6 మాత్రమే ఫైనల్స్‌కు వెళతారు. అలాగే మహిళల ట్రాప్‌ ఈవెంట్‌ తొలిరోజు పోటీల్లో రాజేశ్వరి కుమారి 21, శ్రేయాసి సింగ్‌ 22వ స్థానాల్లో నిలిచారు.

MANU-SARAB-(10).jpg

ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో తొలి పతకం సాధించిన షూటర్‌గా మను భాకర్‌

ఒలింపిక్స్‌లో తొలి టీమ్‌ మెడల్‌ సాధించిన షూటింగ్‌ జోడీగా మను-సరబ్‌జోత్‌

‘అభిమానులను నిరాశపర్చను’

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధిస్తానని నేనేమాత్రం ఊహించలేదు. ఎవరికైనా ఇక్కడ మెడల్‌ సాధించాలనే కల ఉంటుంది. కానీ నేను రెండు సాధించాను. అలాగే శుక్రవారం మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అందులోనూ గెలిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? ఇలాగే ప్రజలంతా నాపై ప్రేమను కురిపించాలి. వారిని నిరాశపర్చననే అనుకుంటున్నా. టోక్యోలో ఓటమి తర్వాత ఈ పతకం విలువ తెలిసొచ్చింది. గతాన్ని వదిలేసి ముందుకు కదిలి ఫలితం సాధించాను.

- మను భాకర్‌


మిక్స్‌డ్‌ టీమ్‌లో కాంస్యం సాధించిన మను భాకర్‌, సరబ్‌జోత్‌కు శుభాకాంక్షలు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా నిలిచిన మను చరిత్ర సృష్టించింది. భవిష్యత్‌లో ఇద్దరికీ మరిన్ని విజయాలు లభించాలి.

- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మన షూటర్లు దేశం గర్వించదగ్గ ప్రదర్శన కొనసాగిస్తూనే ఉన్నారు. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన మను, సరబ్‌జోత్‌కు అభినందనలు. ఇద్దరూ అద్భుత నైపుణ్యం, టీమ్‌ వర్క్‌ను కనబరిచారు. మను అకుంఠిత దీక్ష, అంకితభావంతో రెండో పతకం సాధించింది.

- ప్రధాని నరేంద్ర మోదీ

Updated Date - Jul 31 , 2024 | 06:29 AM