Pakistan Cricket Team: పాకిస్థాన్ పరువు పాయె..
ABN , Publish Date - Nov 16 , 2024 | 06:34 AM
అంతర్జాతీయ వేదికలమీద భారత్‌పై దుష్ప్రచారం చేయడం.. ఆ క్రమంలో ప్రతీసారీ అభాసుపాలవడం.. ఇదీ పాకిస్థాన్ తీరు. అయినా ఆ దేశం మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడంలేదు. ఈసారి భారత్‌ను కవ్వించేందుకు చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను
పీవోకేలో చాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శనకు ఏర్పాట్లు
భారత క్రికెట్ బోర్డు అభ్యంతరం
ఐసీసీ దృష్టికి పీసీబీ కవ్వింపు చర్య
స్పందించిన ఐసీసీ ట్రోఫీ ప్రదర్శన రద్దు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలమీద భారత్‌పై దుష్ప్రచారం చేయడం.. ఆ క్రమంలో ప్రతీసారీ అభాసుపాలవడం.. ఇదీ పాకిస్థాన్ తీరు. అయినా ఆ దేశం మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడంలేదు. ఈసారి భారత్‌ను కవ్వించేందుకు చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌ను ఉపయోగించుకోవాలని చూసింది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లకూడదని భారత్ నిర్ణయించిన విషయం విదితమే. ఆ ఉక్రోషంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో టోర్నమెంట్ ట్రోఫీని ప్రదర్శించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. అయితే పీసీబీ చర్యను తీవ్రంగా ఆక్షేపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృష్టికి తీసుకెళ్లింది. పాకిస్థాన్‌పై చర్యకు డిమాండ్ చేసింది. తక్షణమే స్పందించిన ఐసీసీ.. పీవోకేలో ట్రోఫీ ప్రదర్శన కార్యక్రమాన్ని రద్దు చేసింది. దాంతో అంతర్జాతీయంగా పాకిస్థాన్ తన పరువు మరోసారి పోగొట్టుకుంది.
విషయమేమిటంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాలి. అయితే 2008 నుంచి పాక్‌లో ఆడేందుకు నిరాకరిస్తున్న భారత జట్టు ఈసారి అదే పంథాను కొనసాగిస్తూ చాంపియన్స్ ట్రోఫీలో తలపడేందుకు ఆ దేశం వెళ్లబోమని స్పష్టంజేసింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ విధానంలో అంటే..భారత్ ఆడే మ్యాచ్‌లను వేరే దేశంలో నిర్వహించాలని ఐసీసీ ప్రతిపాదించింది. కానీ పీసీబీ టోర్నీ ఆసాంతం తమ దేశంలోనే నిర్వహించాలని పట్టుబడుతోంది. ఫలితంగా..చాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికాకు మార్చాలని ఐసీసీ యోచిస్తోంది. ఈక్రమంలో టోర్నీపై ఐసీసీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. అలాగే గత సోమవారం లాహోర్‌లో ధూం..ధాంగా నిర్వహించాల్సిన టోర్నీ ట్రోఫీ ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా ఐసీసీ అనూహ్యంగా వాయిదా వేసింది. టోర్నీ షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించలేదు. మరోవైపు.. ఐసీసీని సంప్రదించకుండా టోర్నీని తమ దేశంలోని పలు నగరాల్లో ప్రదర్శించే షెడ్యూల్ (నవంబరు 16-24)ను పీసీబీ ఏకపక్షంగా ఖరారు చేసింది. శనివారం లాహోర్‌లో ఈ కార్యక్రమం మొదలవ్వాల్సి ఉంది. తమ దేశంలోని వివిధ నగరాలతోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దు, ముర్రే, హుంజా, ముజఫరాబాద్‌లలో కూడా ట్రోఫీని ప్రదర్శించనున్నట్టు పీసీబీ వెల్లడించడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించిం ది. తమ దేశంలో ఆడేందుకు నిరాకరించడంతో కవ్వింపు చర్యల్లో భాగంగా పీసీబీ ఈ చర్య చేపట్టిందని బీసీసీఐ ఆక్షేపించింది. పాకిస్థాన్ చర్యను ఖండించిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఐసీసీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ‘ఐసీసీ పెద్దలతో బీసీసీఐ కార్యదర్శి మాట్లాడారు. పాక్‌పై కఠిన చర్య తీసుకోవాలని గట్టిగా కోరారు. ఇస్లామాబాద్‌లో ట్రోఫీని ప్రదర్శించడంపై అభ్యంతరం లేదు. కానీ పీవోకేలో ప్రదర్శించనుండడంపైనే మా అభ్యంతరం’ అని బీసీసీఐ అధికారి శుక్రవారం తెలిపారు. బీసీసీఐ ఆక్షేపణతో పీవోకేలో ట్రోఫీ ప్రదర్శనను ఐసీసీ రద్దు చేసింది. ఒకవేళ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ వదులుకుంటే, టోర్నీని భారత్‌లో నిర్వహించేందుకూ ఐసీసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఎందుకు వెళ్లరో..రాత పూర్వకంగా ఇవ్వండి!
చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్‌కు భారత జట్టును ఎందుకు పంపడంలేదో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని బీసీసీఐని ఐసీసీ కోరినట్టు తెలిసింది. పాక్ వెళ్లబోమని ఐసీసీకి బీసీసీఐ ఇప్పటికే చెప్పేసింది. ఇదే విషయాన్ని పీసీబీకి ఐసీసీ చేరవేసింది. కానీ బీసీసీఐ నిర్ణయాన్ని తెలియజేసే లేఖను తమకు అందజేయాలని ఐసీసీని పీసీబీ అడిగిందట. దీంతో తమ నిర్ణయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలని బీసీసీఐకి ఐసీసీ సూచించినట్టు తెలిసింది.
ఐసీసీ టోర్నీల బహిష్కరణకు పాక్..?
భారత్ తమ దేశానికి రాని పక్షంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. భారత్ పాల్గొనే ఐసీసీ ఈవెంట్లతో పాటు భారత్ వేదికగా జరిగే ఏ టోర్నీలోనూ పాక్ పాల్గొనకూడదని పీసీబీ నిర్ణయించనున్నదట.
టోర్నీ నిర్వహణకు మూడు ప్రత్యామ్నాయాలు..
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ సందిగ్ధంలో పడిన తరుణంలో.. పీసీబీ మాజీ చీఫ్ నజామ్ సేథీ మూడు ప్రత్యామ్నాయాలను ఐసీసీకి సూచించినట్టు తెలిసింది.
మొదటిది హైబ్రిడ్ విధానంలో జరపడం. ఈ పద్ధతిలో భారత్ మ్యాచ్‌లను వేరే చోట నిర్వహిస్తారు. గతంలో సేథీ పీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆసియా కప్‌ను ఈ విఽధానంలో నిర్వహించారు. అప్పుడు భారత్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది.
రెండోది.. టోర్నీని వేరే దేశానికి తరలించడం. అప్పుడు టోర్నీని బహిష్కరించడం, లేదంటే తరలించిన దేశంలో ఆడడం పాకిస్థాన్‌కు ఉండే ప్రత్యామ్నాయంగా సేథీ పేర్కొన్నారు. కానీ హైబ్రిడ్ పద్ధతిని తిరస్కరించిన పాక్ వేరే వేదికలో ఆడుతుందా అన్నది ప్రశ్న.
ఇక..భావోద్వేగాలతో కాకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడమే మేలని మూడో ప్రత్యామ్నాయంగా పాకిస్థాన్‌కు సేథీ సూచించారు.