Share News

Cheteshwar Pujara: దేశవాళీ క్రికెట్‌లో చతేశ్వర్ పుజారా రికార్డు డబుల్ సెంచరీ

ABN , Publish Date - Oct 21 , 2024 | 07:32 PM

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌరాష్ట్ర వర్సెస్ ఛత్తీస్‌గఢ్ మ్యాచ్‌లో పుజారా 234 పరుగులు బాదాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇది ఏకంగా 18వ డబుల్ సెంచరీ. దీంతో ప్రపంచ దిగ్గజాల సరసన నిలిచాడు.

Cheteshwar Pujara: దేశవాళీ క్రికెట్‌లో చతేశ్వర్ పుజారా రికార్డు డబుల్ సెంచరీ
Cheteshwar Pujara

టెస్ట్ బ్యాట్స్‌మెన్ చెతేశ్వర్ పుజారా భారత జట్టుకు దూరమై చాలా కాలమే అయ్యింది. అయినప్పటికీ జట్టులోకి పునరాగమనంపై అతడు ఆశలు వదులుకున్నట్లు కనిపించడం లేదు. ఇటు దేశవాళీ క్రికెట్‌తో పాటు అటు కౌంటీ క్రికెట్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున ఆడుతున్న పుజారా ఛత్తీస్‌గఢ్‌పై డబుల్ సెంచరీ బాదాడు. ఆరంభంలోనే హార్విక్ దేశాయ్‌ ఔట్ రూపంలో సౌరాష్ట్రకు ఎదురుదెబ్బ తగలగా.. పుజారా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. దాదాపు 127 ఓవర్ల సమయాన్ని క్రీజులో గడిపాడు.


రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పుజారా 348 బంతులు ఎదుర్కొని 234 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి.

కాగా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది ఏకంగా 18వ డబుల్ సెంచరీ. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక 200 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పుజారా నాలుగవ స్థానానికి ఎగబాకాడు. పుజారా కంటే ముందు డాన్ బ్రాడ్‌మన్, వాలీ హమ్మండ్, ఎలియాస్ హెండ్రెన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలోని టాప్-50 క్రికెటర్లలో ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఏకైక ఆటగాడు పుజారా కావడం విశేషం.


ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీ కొట్టిన ఆటగాళ్లు

1. డాన్ బ్రాడ్‌మాన్ - 37

2. వాలీ హమ్మండ్ - 36

3. ఎలియాస్ హెండ్రెన్ - 22

4. చెతేశ్వర్ పుజారా - 18

5. హెర్బర్ట్ సట్‌క్లిఫ్, మార్క్ రాంప్రకాశ్ - 17.


ఇక సౌరాష్ట్ర వర్సెస్ ఛత్తీస్‌గఢ్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గఢ్ 7 వికెట్ల నష్టానికి 578 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అమన్‌దీప్ ఖరే సెంచరీతో అదరగొట్టి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. కాగా పుజారా డబుల్ సెంచరీతో సౌరాష్ట్ర 478 భారీ స్కోరు సాధించడంతో ఛత్తీస్‌గఢ్ స్కోరుకు చేరువైంది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Updated Date - Oct 21 , 2024 | 07:35 PM