India vs Pakistan: ఆ రెండు కారణాల వల్లే పాకిస్తాన్ కొంపకొల్లేరు
ABN , Publish Date - Jun 10 , 2024 | 04:08 PM
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చివరివరకూ ఉత్కంఠభరితంగా..
టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భాగంగా.. ఆదివారం పాకిస్తాన్‌తో (Pakistan) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (India) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. తన చిరకాల ప్రత్యర్థిపై భారత్ మరోసారి ఆధిపత్యాన్ని చెలాయించింది. కేవలం ఆరు పడుగల తేడాతో బాబర్ ఆజం బృందాన్ని మట్టికరిపించింది. ఈ నేపథ్యంలోనే.. ఆ జట్టు కెప్టెన్ తమ బాబర్ ఆజం (Babar Azam) ఓటమిపై స్పందించాడు. తమ ఓటమికి కారణాలేంటో వివరించాడు.
ప్రధాన కారణాలు ఇవే
భారత్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో తాము ఓడిపోవడానికి కారణం.. బ్యాటింగ్ వైఫల్యమేనని బాబర్ ఆజం తెలిపాడు. తమ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని, కానీ బ్యాటింగ్‌లో మాత్రం మెరుగ్గా రాణించలేకపోయామని అన్నాడు. లక్ష్య ఛేదనలో తాము వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఎక్కువ డాట్ బాల్స్ పడటంతో.. తాము వెనుకబడిపోయామని చెప్పాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ నెమ్మదిగా పరుగులు రాబట్టాలని అనుకున్నామని.. కానీ ఆ ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నాడు. తొలి ఆరు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయాలని భావించామని.. కానీ తొలి వికెట్ పడ్డాక తిరిగి కోలుకోలేకపోయామని వెల్లడించాడు.
వారి నుంచి ఎక్కువ ఆశించలేం
వాస్తవానికి పిచ్ డీసెంట్‌గానే ఉందని, బ్యాట్ మీదకు బంతి వస్తోందని, అదనపు బౌన్స్‌కు కూడా అనుకూలించిందని బాబర్ ఆజం పేర్కొన్నాడు. లక్ష్య ఛేధనలో సెకండాఫ్‌లో ఎక్కువ డాట్ బాల్స్ పడ్డాయన్న బాబర్.. చివర్లో టెయిలెండర్ల నుంచి ఎక్కువగా ఆశించలేమని, అది సరైంది కాదని చెప్పుకొచ్చాడు. తమకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని.. ఆ రెండింటిలోనూ తప్పక విజయం సాధించాల్సి ఉంటుందని, ఆ దిశగా ప్రణాళికలు రచించుకుంటామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లకు ముందు తమ ఆటతీరులోని లోపాల గురించి ఓసారి అందరూ కూర్చొని చర్చించుకుని, ముందుకు సాగుతామని బాబర్ చెప్పాడు.
ఇండియా vs పాకిస్తాన్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రిషభ్ పంత్ 42 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ (20), రోహిత్ శర్మ (13) మినహాయిస్తే.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అనంతరం లక్ష్య ఛేధనలో.. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. భారత్ 6 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి పాక్ ఓటమిని శాసించడంతో.. అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
Read Latest Sports News and Telugu News