Share News

India vs England: తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం.. చేజేతులా పోగొట్టుకున్న భారత్

ABN , Publish Date - Jan 28 , 2024 | 05:50 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆ లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. భారత బ్యాటర్లు నిలకడగా రాణించకపోవడం వల్లే ఈ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

India vs England: తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం.. చేజేతులా పోగొట్టుకున్న భారత్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆ లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. భారత బ్యాటర్లు నిలకడగా రాణించకపోవడం వల్లే ఈ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39), కేఎల్ రాహుల్ (22), శ్రీకర్ భరత్ (28), అశ్విన్ (28) పర్వాలేదనిపించారంతే. మిగతా ఆటగాళ్లందరూ తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న శుభ్‌మన్ గిల్ (0), శ్రేయస్ అయ్యర్ (13) చేతులెత్తేశారు.

మొదట్లో.. భారతీయ ఓపెనర్లు జట్టుకి శుభారంభాన్నే అందించారు. రోహిత్, జైస్వాల్ కలిసి తొలి వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో చిచ్చరపిడుగులా విజృంభించిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తాడని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా అతడు 15 పరుగులకే ఔట్ అయ్యాడు. అతడు ఔట్ అయ్యాక.. భారత్ క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 119 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడం చూసి.. టీమిండియా అప్పటికే జెండా ఎత్తేస్తుందని భావించారు. అప్పుడు శ్రీకర్, అశ్విన్ కలిసి మ్యాచ్‌పై మళ్లీ ఆశలు రేకెత్తేశారు. వాళ్లిద్దరు ఎనిమిదో వికెట్‌కి ఏకంగా 57 పరుగుల భాస్వామ్యాన్ని జోడించారు.


దాదాపు కథ ముగిసిందని అనుకున్నప్పుడు.. శ్రీకర్, అశ్విన్ అద్భుతంగా రాణించడం చూసి మ్యాచ్ భారత్ వైపు మలుపు తిరిగింది. వీళ్లిద్దరు ఇలాగే ఆడితే.. విజయం భారత్‌దేనని అంతా ఫిక్సైపోయారు. కానీ.. ఇంతలోనే వాళ్లిద్దరు తమ వికెట్లు సమర్పించుకున్నారు. ఒకరి తర్వాత మరొకరు వెనువెంటనే ఔట్ అయ్యారు. దాంతో ఆశలు సన్నగిల్లాయి. చివర్లో సిరాజ్, బుమ్రా కూడా కలిసి బాగానే పోరాడారు. కాసేపు వీళ్లు ఇంగ్లండ్ టీమ్‌కి ముచ్చెమటలు పట్టించారు. కానీ.. సిరాజ్ అనవసరంగా ముందుకొచ్చి భారీ షాట్ కొట్టబోయి, స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ ఆలౌట్ అవ్వగా, ఇంగ్లండ్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక ఇంగ్లండ్ బౌలర్ల విషయానికొస్తే.. టామ్ హార్ట్‌లీ టీమిండియా బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. అతడు ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. మొదటి నుంచి కీలకమైన వికెట్లు తీసి.. తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే తీసి భారీ పరుగులు సమర్పించుకున్న అతగాడు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బంతిని తిప్పేసి, ఏడు వికెట్లతో తాండవం చేశాడు. ఇక జాక్ లీక్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో.. ఐదు మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యం సాధించింది.

Updated Date - Jan 28 , 2024 | 05:51 PM