Share News

New Zealand: న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్లపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు.. జరిగిన తప్పు ఇదే

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:37 PM

భారత్‌లో టెస్ట్ సిరీస్ మ్యాచ్‌ల వేదికలు, షెడ్యూల్‌ ప్రకటనలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాస్త సృజనాత్మకత జోడించింది. భారత మ్యాప్‌పై మ్యాచ్ వేదికలను చూపించే ప్రయత్నం చేసింది. అయితే సరైన మ్యాప్‌ను తీసుకోకపోవడంతో కివీస్ ఆటగాళ్లతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డుపై సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

New Zealand: న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్లపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు.. జరిగిన తప్పు ఇదే
New Zealand

న్యూజిలాండ్ క్రికెటర్లు గానీ, ఆ దేశ క్రికెట్ బోర్డు గానీ వివాదాలకు చాలా దూరం. హూందాగా వ్యవహరిస్తుంటారని ఆ దేశ ఆటగాళ్లకు చాలా మంచి పేరు ఉంది. అయితే పుణే వేదికగా జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు కివీస్ ప్లేయర్లు భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ -కశ్మీర్, లడఖ్ సరిహద్దులు సరిగా చూపించని భారతదేశ చిత్రపటాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడమే ఇందుకు కారణంగా ఉంది.


నిజానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు భారత్‌తో టెస్ట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌, వేదికలను ఇండియా మ్యాప్‌పై వివరణాత్మకంగా వెల్లడించే ప్రయత్నం చేసింది. అయితే ఇందుకోసం ఎంపిక చేసిన ఇండియా మ్యాప్ సరిగా లేదు. జమ్మూ కశ్మీర్, లఢఖ్ సరిహద్దులు తప్పుగా కనిపిస్తున్నాయి.


సరైన అవగాహన లేకుండా పోస్టు చేసిన ఈ మ్యాప్‌పై భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దేశ ఉత్తర సరిహద్దులు మ్యాప్‌లో సరిగా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ న్యూజిలాండ్ ఆటగాళ్లు, ఆ దేశ క్రికెట్ బోర్డుపై భారత ఫ్యాన్స్ విమర్శల దాడి చేస్తున్నారు.

ఎక్స్‌లో ఓ వ్యక్తి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తి స్పందిస్తూ.. న్యూజిలాండ్ క్రికెట్ హ్యాండిల్ పోస్ట్ చేసిన ఈ మ్యాప్‌ను దయచేసి ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించాడు. భారతదేశం మ్యాప్‌ను తప్పుగా చూపారంటూ ఓ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ డియర్ న్యూజిలాండ్ ప్లేయర్స్.. కివీస్ జట్టును మా రెండవ సొంత జట్టుగా భావిస్తున్నాం. కానీ మీరు మా దేశం మ్యాప్‌ను తప్పుగా పోస్ట్ చేస్తారని ఊహించలేదు. దయచేసి దీన్ని సరి చేయండి. మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు తప్పుగా ఉన్నాయి’’ అని ఒకరు సూచన చేశారు. కాగా తీవ్ర విమర్శలు రావడంతో పోస్టును న్యూజిలాండ్ డిలీట్ చేసింది.


కాగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరు టెస్ట్ మ్యాచ్ ముగియగా.. రెండవ మ్యాచ్‌ మహారాష్ట్రలోని పుణే వేదికగా అక్టోబర్ 24న ప్రారంభం కానుంది.

ఇక బెంగళూరు టెస్టులో కివీస్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. 1988 తర్వాత తొలిసారి భారత గడ్డపై ఆ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని టీమిండియా పెద్ద పొరపాటు చేసింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 464 పరుగులకు ఆలౌటైంది. అయితే లక్ష్యం కేవలం 107 పరుగులు మాత్రమే కావడం న్యూజిలాండ్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. మిగిలి ఉన్న మరో రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా కివీస్ తొలి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏఐ వినియోగంలో జర జాగ్రత్త

For more Sports News and Business News and Telugu News

Updated Date - Oct 22 , 2024 | 04:54 PM