Share News

Pakistan: పాకిస్తాన్‌కు తప్పిన గండం.. కానీ ముందుంది మరో పెద్ద చిక్కు!

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:31 PM

కెనడాపై గెలుపుతో కాస్త ఊపిరి పీల్చుకున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఇప్పుడు మరింత సంతోషంలో మునిగిపోయింది. అసలు ఆ జట్టు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు కారణం..

Pakistan: పాకిస్తాన్‌కు తప్పిన గండం.. కానీ ముందుంది మరో పెద్ద చిక్కు!
Pakistan Super8 Qualify Scenario Explained

కెనడాపై గెలుపుతో కాస్త ఊపిరి పీల్చుకున్న పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ టీమ్ ఇప్పుడు మరింత సంతోషంలో మునిగిపోయింది. అసలు ఆ జట్టు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు కారణం.. యూఎస్ఏపై భారత్ (India vs USA) ఘనవిజయం సాధించడమే! భారత్ సాధించిన విజయంతో పాక్ ముందున్న ఓ గండం తప్పింది. సూపర్-8కు చేరే అవకాశాలు మెరుగుపడటంతో.. ఆ జట్టు సంబరాలు జరుపుకుంటోంది. అయితే.. పాక్ ముందు మరో పెద్ద చిక్కు కూడా ఉంది. అది అధిగమిస్తేనే సూపర్-8కి అర్హత సాధిస్తుంది. లేకపోతే.. తట్టాబుట్టా సర్దేయక తప్పదు.


టీ20 వరల్డ్‌కప్-2024 (T20 World Cup) టోర్నీ ఆరంభంలో పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలుత అమెరికా, ఆ తర్వాత భారత్ చేతిలో పాక్ జట్టు ఘోర పరాజయాల్ని చవిచూసింది. దాంతో.. సూపర్-8లో చోటు దక్కించుకునే అవకాశం పాక్‌కు క్లిష్టతరంగా మారింది. సూపర్-8లో ఆ జట్టు అడుగుపెట్టాలంటే.. పాక్ తదుపరి రెండు మ్యాచ్‌ల్ని తప్పక గెలవాలి. మరోవైపు.. రెండు విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న యూఎస్ఏ తన నెక్ట్స్ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి తరుణంలో కెనడాపై పాక్ గెలవడం, యూఎస్ఏఐపై భారత్ విజయం సాధించడంతో.. పాక్ నెట్ రన్‌రేట్ మెరుగుపడింది. దీంతో.. పాక్ జట్టు సేఫ్ జోన్‌లోకి చేరింది.


అయితే.. పాక్ ముందు మరో ప్రమాదం పొంచి ఉంది. పాక్ తన తదుపరి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడనుంది. సూపర్-8లో అర్హత సాధించాలంటే.. పాక్ తప్పకుండా ఆ మ్యాచ్ గెలుపొందాల్సి ఉంటుంది. మరోవైపు.. అదే ఐర్లాండ్ జట్టుతో తలపడబోతున్న యూఎస్ఏ జట్టు ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది జరిగితేనే సూపర్-8కు పాకిస్తాన్ అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఐర్లాండ్‌పై యూఎస్ఏ ఆధిపత్యం చెలాయిస్తే మాత్రం.. పాక్ ఇక ఇంటికే. అంటే.. యూఎస్ఏతో పాక్ జట్ల భవితవ్యం ఐర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లపై ఆధారపడి ఉంది. మరి.. ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో? ఎవరు ఈ టోర్నీ నుంచి నిష్ర్కమిస్తారో చూడాలి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 03:32 PM