Share News

India Vs New Zealand: మూడవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంటికి వెళ్లిన టీమిండియా స్టార్ క్రికెటర్

ABN , Publish Date - Oct 31 , 2024 | 02:56 PM

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలు కానున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడబోడని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది.

India Vs New Zealand: మూడవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంటికి వెళ్లిన టీమిండియా స్టార్ క్రికెటర్
Team India

ముంబై: భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలు కానున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడబోడని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. కాబట్టి రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు పేర్కొంది. కాగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెటర్లు నవంబర్ 10న ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఆ సమయంలో బుమ్రా జట్టుతో కలుస్తాడని తెలిపింది. బుమ్రా ఇప్పటికే అహ్మదాబాద్‌కు వెళ్లిపోయాడని పేర్కొంది. కాగా బుమ్రా గైర్హాజరవడంతో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి.


“బుమ్రా ముంబై టెస్ట్ ఆడడం లేదు. ఇంటికి వెళ్లాడు. బుమ్రా కాస్త విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని భారత జట్టు యాజమాన్యం భావించింది. టీమిండియా ఆస్ట్రేలియాకు బయలుదేరేటప్పుడు అతడు జట్టుతో కలుస్తాడు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది.


కాగా పూణే వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌‌లో భారత బ్యాటర్లు స్పిన్నర్లను సరిగా ఎదుర్కోలేకపోయారు. దీంతో టీమిండియా బ్యాటర్లు నాణ్యమైన స్పిన్ బౌలింగ్‌ను ఆడలేకపోతున్నారంటూ వస్తున్న విమర్శలను భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఖండించాడు. టీ20 క్రికెట్‌లో బాదుడు ధోరణి ఆటగాళ్లపై ప్రభావం చూపుతోందని అన్నాడు. స్పిన్‌పై ఆడే విషయంలో భారత బ్యాటర్ల నైపుణ్యం తగ్గిపోయిందని తాను భావించడం లేదని చెప్పాడు.


కొన్నిసార్లు ప్రత్యర్థులు కూడా రాణిస్తారని, పూణే టెస్టులో మిచెల్ సాంట్నర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని గంభీర్ ప్రశంసించాడు. తాము మరింత కష్టపడి పని చేస్తూనే ఉంటామని, మెరుగుపడతామని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా స్పిన్‌కు అనుకూలమైన పూణే పిచ్‌పై రెండవ టెస్టులో భారత జట్టు 113 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

Updated Date - Nov 01 , 2024 | 09:42 AM