Share News

ICC T20I Rankings: ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్.. భారీగా ఎగబాకిన ఆ ఇద్దరి ర్యాంక్స్

ABN , Publish Date - Jul 10 , 2024 | 05:13 PM

ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మతో పాటు రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టడంతో.. ఐసీసీ టీ20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో వారి స్థానాలు..

ICC T20I Rankings: ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్.. భారీగా ఎగబాకిన ఆ ఇద్దరి ర్యాంక్స్
ICC T20I Batting Rankings

ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మతో (Abhishek Sharma) పాటు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అదరగొట్టడంతో.. ఐసీసీ టీ20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో వారి స్థానాలు మెరుగుపడ్డాయి. రుతురాజ్ 13 స్థానాలు ఎగబాకి టాప్-10లోకి ప్రవేశించగా.. అభిషేక్ టాప్-100లో చోటు సంపాదించుకున్నాడు. తొలుత రుతురాజ్ గురించి మాట్లాడుకుంటే.. ఇంతకుముందు అతను 20వ స్థానంలో ఉండేవాడు. కానీ.. జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో, 13 స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరాడు. ఆ మ్యాచ్‌లో 47 బంతుల్లో 77 పరుగులు చేసిన అతని ఖాతాలో 662 పాయింట్లు చేరాయి.


ఇక అభిషేక్ శర్మ విషయానికొస్తే.. అతను ఐసీసీ టీ20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 75వ స్థానానికి ఎగబాకాడు. జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అతగాడు, రెండో మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి.. మైదానంలో బౌండరీల మోత మోగించేశాడు. ఫలితంగా.. అతడు 46 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. దీంతో.. కేఎల్ రాహుల్‌తో కలిసి జాయింట్-థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారతీయుడిగా చరిత్రపుటలకెక్కాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అతని దశ తిరిగిపోయింది. అభిషేక్‌తో పాటు రుతురాజ్ ఊచకోత కోయడం వల్లే.. రెండో మ్యాచ్‌లో భారత జట్టు అఖండ విజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టుని మట్టికరిపించింది.


అయితే.. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో మాత్రం ఇప్పటికీ ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ కొనసాగుతున్నాడు. 844 పాయింట్లతో అతడు మొదటి స్థానంలో ఉండగా.. 821 పాయింట్లతో సూర్యకుమార్ రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. శ్రీలంక టీ20 కెప్టెన్ హసరంగా ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేశాడు. 222 రేటింగ్ పాయింట్లతో హసరంగా అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్ 213 పాయింట్లతో రెండో స్థానానికి దిగజారిపోయాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 05:13 PM