Watch Video: 16 గంటల సుదీర్ఘ ప్రయాణం.. ఆటగాళ్లు విమానంలో ఏం చేశారు?
ABN , Publish Date - Jul 04 , 2024 | 01:19 PM
బెరిల్ హరికేన్ కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్‌లోనే చిక్కుకున్న భారత ఆటగాళ్లు.. ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చేశారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆ ద్వీపదేశం నుంచి..
బెరిల్ హరికేన్ (Beryl Hurricane) కారణంగా మూడు రోజుల పాటు బార్బడోస్‌లోనే (Barbados) చిక్కుకున్న భారత ఆటగాళ్లు.. ఎట్టకేలకు ఇండియాకు తిరిగొచ్చేశారు. బీసీసీఐ (BCCI) ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆ ద్వీపదేశం నుంచి భారత్‌కు వచ్చారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 4:50కి బయలుదేరి, గురువారం ఉదయం 6:00 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. అంటే.. వీరి ప్రయాణం 16 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. మరి.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్లు ఏం చేశారు?
తాము వరల్డ్‌కప్ గెలిచామన్న ఆనందంలో.. ఆటగాళ్లందరూ విమానంలో ఎక్కువసేపు సంబరాలు జరుపుకున్నారు. ఆ అద్భుత క్షణాలను నెమరవేసుకుంటూ.. ట్రోఫీని చేత పట్టుకొని ముద్దాడారు. ఫోటోలు క్లిక్‌మనిపించడంతో పాటు వీడియోలూ తీసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. మొత్తానికి మేము కప్ గెలిచామన్నట్టు.. ట్రోఫీని చూపిస్తూ విమానంలో అరుపులు అరిచాడు. విరాట్ కోహ్లీ ట్రోఫీ పట్టుకొని భావోద్వేగానికి లోనవ్వగా.. మిగతా ఆటగాళ్లూ ఎమోషనల్ అయ్యారు. మళ్లీ ఇలాంటి రోజు రాదన్నట్టు.. విమానంలో సరదాగా గడిపారు. కేవలం ఆటగాళ్లే కాదు.. రిపోర్టర్లు సైతం ట్రోఫీ చేత పట్టుకొని ఫోటోలు దిగడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రిపోర్ట్స్ ప్రకారం.. ఆటగాళ్లకు బిజినెస్ క్లాస్ సెక్షన్, రిపోర్టర్లకు ఎకానమీ క్లాస్ సీట్లు కేటాయించినట్లు తెలిసింది. రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, చాహల్, సూర్యకుమార్, రాహుల్ ద్రవిడ్ కొద్దిసేపు జర్నలిస్టులతో సమయం గడిపినట్లు తెలిసింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు కాకుండా.. అందరూ ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేశారు. ఇక ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక ఆటగాళ్లను ఘనంగా స్వాగతించిన విషయం తెలిసిందే. చప్పట్లు, డప్పులతో స్వాగతం పలకగా.. రోహిత్‌తో పాటు సూర్య, హార్దిక్, ఇంకా పలువురు ఆటగాళ్లు డ్యాన్స్ చేశారు. ఆపై ప్రతిఒక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తూ.. ఆటగాళ్లు తమతమ రూమ్‌లకు వెళ్లిపోయారు. అంతకుముందు.. ఓ ప్రత్యేకమైన కేక్ సైతం కట్ట చేయడం జరిగింది.
Read Latest Sports News and Telugu News