Hockey India: పారిస్ ఒలంపిక్స్ కోసం జట్టుని ప్రకటించిన హాకీ ఇండియా.. ఆ ఐదుగురికి ఛాన్స్
ABN , Publish Date - Jun 26 , 2024 | 06:17 PM
జూలై 26వ తేదీ నుంచి పారిస్ ఒలంపిక్స్ ప్రారంభం కానున్న తరుణంలో.. హాకీ ఇండియా తాజాగా 16 మంది సభ్యులతో కూడిన పురుషుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకి...
జూలై 26వ తేదీ నుంచి పారిస్ ఒలంపిక్స్ (Paris Olympics) ప్రారంభం కానున్న తరుణంలో.. హాకీ ఇండియా (Hockey India) తాజాగా 16 మంది సభ్యులతో కూడిన పురుషుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకి హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) నాయకత్వం వహిస్తుండగా.. హార్దిక్ సింగ్ (Hardik Singh) వైస్-కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో ఐదుగురు యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. వాళ్లు తొలిసారి ఒలంపిక్స్‌లో ఆడనున్నారు. వారే.. జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, రాజ్‌కుమార్ పాల్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్. ఈ స్క్వాడ్‌లో వెటరన్ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్, మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. వీళ్లు నాలుగోసారి సమ్మర్ గేమ్స్‌లో ఆడనున్నారు.
ఈ జట్టు ప్రకటన అనంతరం ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ (Craig Fulton) మాట్లాడుతూ.. ఈ జట్టు పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో తలపడేందుకు తమ భారత జట్టు సిద్ధంగా ఉందన్నారు. తుది జట్టులో ఎంపికైన ప్రతి ప్లేయర్ ఈ ఒలంపిక్స్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన అందిస్తాడని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఈ స్క్వాడ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలరని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా రాణించగల శక్తివంతమైన జట్టుని నిర్మించామని తాను అనుకుంటున్నానని పేర్కొన్నారు. భారత్‌కు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని ఫుల్టన్ చెప్పుకొచ్చారు.
కాగా.. గతంలో భారత జట్టు ఒలంపిక్స్‌లో 8 బంగారు పతకాలతో పాటు ఒకటి రజత, మూడు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. ఈ ఒలంపిక్స్‌లో భారత జట్టు బెల్జియం (గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచింది.), ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌లతో కలిసి పూల్ Bలో ఉంది. జులై 27వ తేదీన న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఒలంపిక్స్‌లో భారత జట్టుకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి.. ఈసారి కూడా సత్తా చాటి, బంగారు పతకాన్ని స్వాధీనం చేసుకుంటుందని క్రీడాభిమానుల్లో భారీ ఆశలున్నాయి.
హాకీ టీమ్: హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), హార్దిక్ సింగ్ (వైస్ కెప్టెన్), పీఆర్ శ్రీజేష్ (గోల్‌కీపర్), మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్, మన్‌దీప్ సింగ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, గుర్జంత్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, షంషేర్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్
Read latest Sports News and Telugu News