Share News

ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా.. తప్పుకోబోతున్న ప్రస్తుత అధ్యక్షుడు బార్ క్లే..!

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:09 PM

ఐసీసీ ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్ క్లే పదవీ కాలం నవంబర్ 30వ తేదీతో ముగియబోతోంది. మళ్లీ పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేనట్టు బార్ క్లే ఇప్పటికే ఐసీసీ సభ్యులకు తెలియజేశాడు. దీంతో బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.

ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా..  తప్పుకోబోతున్న ప్రస్తుత అధ్యక్షుడు బార్ క్లే..!
Jay Shah

భారత్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కార్యదర్శి జై షా (Jay Shah) ఐసీసీ ఛైర్మన్ రేసులో ఉన్నారు. ఐసీసీ ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్ క్లే పదవీ కాలం నవంబర్ 30వ తేదీతో ముగియబోతోంది. మళ్లీ పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేనట్టు బార్ క్లే ఇప్పటికే ఐసీసీ సభ్యులకు తెలియజేశాడు. దీంతో జై షా ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman) ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ నెల 27వ తేదీన ఈ విషయమై పూర్తి స్పష్టత రాబోతోంది. ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు 27వ తేదీ ఆఖరి రోజు కావడమే అందుకు కారణం.


ఐసీసీ నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి మూడు పర్యాయాలు ఛైర్మన్‌గా ఉండొచ్చు. ఒక్కో టర్మ్‌కు రెండేళ్ల పదవీ కాలం ఉంటుంది. అంటే ఎవరైనా వ్యక్తి గరిష్టంగా ఆరు సంవత్సరాలు ఐసీసీ ఛైర్మన్ హోదాలో ఉండొచ్చు. న్యూజిలాండ్‌కు చెందిన బార్ క్లే ఇప్పటికే నాలుగేళ్లు ఆ పదవిలో ఉన్నాడు. 2020 నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది నవంబర్ 30తో అతడి పదవీ కాలం పూర్తవుతోంది. మూడో సారి పోటీ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పాడు. దీంతో జై షా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 మంది సభ్యులు ఓట్లు వేయాల్సి ఉంది. వారిలో 9 మంది ఓట్లు ఎవరికి పడితే వారు ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవుతారు.


ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మెంబర్లతో సహా ఎక్కువ మంది షా వైపే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న షాకు మరో ఏడాది పదవీ కాలం ఉంది. ఆ తర్వాత అతడు తప్పనిసరిగా బీసీసీఐ పదవుల నుంచి మూడేళ్ల పాటు తప్పుకోవాలి. కాగా, ఇంతకు ముందు భారత్‌కు చెందిన జగన్మోహన్ దాల్మియా (1997-2000), శరద్ పవార్ (2010-12) ఐసీసీ ఛైర్మన్‌ హోదాలో పని చేశారు. ప్రస్తుతం ఆ అవకాశం జై షా ముంగిట నిలిచింది. జై షా ప్రస్తుతం ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

ఐపీఎల్‌తో రూ.5,210 కోట్లు


హోటల్‌లో సర్వర్‌గా ఒలింపిక్‌ పతక విజేత!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 12:09 PM