శతక ‘జై’స్వాల్
ABN , Publish Date - Apr 23 , 2024 | 02:54 AM
ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 104 నాటౌట్) ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపిస్తూ అజేయ శతకం సాధించాడు. అటు బౌలింగ్‌లో పేసర్ సందీప్ శర్మ (5/18) అద్భుత గణాంకాలు...
నేటి మ్యాచ్
చెన్నై X లఖ్‌నవూ, రాత్రి 7.30 గం.
సందీప్‌నకు ఐదు వికెట్లు
రాజస్థాన్ ఘనవిజయం
ముంబైకి నిరాశ
జైపూర్: ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 104 నాటౌట్) ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపిస్తూ అజేయ శతకం సాధించాడు. అటు బౌలింగ్‌లో పేసర్ సందీప్ శర్మ (5/18) అద్భుత గణాంకాలు నమోదు చేయడంతో.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ‘టాప్’షో కొనసాగుతూనే ఉంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహాల్ వధేరా (49) మాత్రమే రాణించారు. బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి గెలిచింది. శాంసన్ (38 నాటౌట్), బట్లర్ (35) ఆకట్టుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా సందీప్ శర్మ నిలిచాడు.
అవలీలగా..: స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ లీగ్‌లో తన రెండో శతకంతో మెరిశాడు. తొలి ఓవర్‌లో బట్లర్ రెండు ఫోర్లతో జోరు చూపగా.. నాలుగో ఓవర్‌లో జైస్వాల్ 6,4,4తో 16 రన్స్ అందించాడు. ఇక పవర్‌ప్లేలో జట్టు 61 పరుగులు సాధించింది. ఆ తర్వాత వర్షంతో ఆట 40 నిమిషాలపాటు ఆగింది. ఎనిమిదో ఓవర్‌లో బట్లర్ అవుటయ్యాడు. జైస్వాల్‌కు కెప్టెన్ శాంసన్ జత కలవడంతో ముంబై బౌలర్లు చేసేదేమీ లేకపోయింది. 31 బంతుల్లోనే జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత 19వ ఓవర్‌లో తొలి బంతికి సెంచరీ పూర్తి చేయగా.. నాలుగో బంతికి ఫోర్‌తో మ్యాచ్‌ను సైతం ముగించాడు.
ఆదుకున్న తిలక్-వధేరా: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ, నేహాల్ వధేరా బ్యాటింగే కీలకంగా నిలిచింది. పేసర్లు బౌల్ట్, సందీప్ శర్మల ధాటికి తొలి నాలుగు ఓవర్లలోనే ఓపెనర్లు రోహిత్ (6), ఇషాన్ (0), సూర్యకుమార్ (10) పెవిలియన్‌కు చేరారు. ఆరో ఓవర్‌లో నబీ (23) 6,4,4తో 18 రన్స్ సాధించగా పవర్‌ప్లేను 45/3తో ముగించింది. అయితే నబీని 8వ ఓవర్‌లో చాహల్ అవుట్ చేయడంతో 52/4తో ముంబై కష్టాలు మరింత పెరిగాయి. ఈ దశలో తిలక్-వధేరా ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్నారు. 16వ ఓవర్‌లో సిక్సర్‌తో తిలక్ ఫిఫ్టీ పూర్తి చేయగా వధేరా మరో రెండు సిక్సర్లు బాది 20 రన్స్ రాబట్టాడు. కానీ ప్రమాదకరంగా మారిన ఈ జోడీని బౌల్ట్ విడదీస్తూ వధేరాను అవుట్ చేశాడు. దీంతో ఐదో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 19వ ఓవర్‌లో హార్దిక్ (10)ను అవేశ్ అవుట్ చేయగా.. ఆఖరి ఓవర్‌లో సందీప్ మూడు పరుగులే ఇచ్చి తిలక్, కొట్జీ (0), డేవిడ్ (3)ల వికెట్లు తీయడంతో ముంబై స్కోరు 180లోపే ముగిసింది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 179/9 (తిలక్ వర్మ 65, నేహల్ వధేరా 49, సందీప్ శర్మ 5/18, బౌల్ట్ 2/32);
రాజస్థాన్: 18.4 ఓవర్లలో 183/1 (యశస్వీ జైస్వాల్ 104 నాటౌట్, సంజూ శాంసన్ 38 నాటౌట్, బట్లర్ 35).
1
ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా చాహల్
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
రాజస్థాన్ 8 7 1 0 14 0.698
కోల్‌కతా 7 5 2 0 10 1.206
హైదరాబాద్ 7 5 2 0 10 0.914
చెన్నై 7 4 3 0 8 0.529
లఖ్‌నవూ 7 4 3 0 8 0.123
గుజరాత్ 8 4 4 0 8 -1.055
ముంబై 8 3 5 0 6 -0.227
ఢిల్లీ 8 3 5 0 6 -0.477
పంజాబ్ 8 2 6 0 4 -0.292
బెంగళూరు 8 1 7 0 2 -1.046
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
కోహ్లీపై 50 శాతం జరిమానా
కోల్‌కతా: బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తన అవుట్ నిర్ణయంపై కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగి కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించాడు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిపై రూ.12 లక్షల జరిమానా విధించారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కర్రాన్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేయడంతో అతడి మ్యాచ్ ఫీజులోనూ 50 శాతం కోత విధించారు.