Nalgonda: కారుణ్య మరణమే శరణమా?
ABN , Publish Date - Sep 06 , 2024 | 05:09 AM
ఆ తల్లి వయసు 70 ఏళ్లు! ఆమెకు 44 ఏళ్ల కుమారుడు! 23 ఏళ్లుగా! కండరాలు చచ్చుబడిపోయి.. కాళ్లు, చేతులు పనిచేయక పూర్తిగా మంచం పడితే.. పొద్దున ముఖం కడిగించడం మొదలు..
23 ఏళ్లుగా చికిత్సలేని జబ్బుతో బతుకీడుస్తున్నాను
70 ఏళ్ల నా తల్లికి ఇక భారం కాదల్చుకోలేదు
ప్రభుత్వమే ఆదుకోవాలి.. లేదా చావనివ్వాలి
నల్లగొండ జిల్లా చిట్యాల వాసి ఆవేదన
నల్లగొండ, సెప్టెంబరు 5: ఆ తల్లి వయసు 70 ఏళ్లు! ఆమెకు 44 ఏళ్ల కుమారుడు! 23 ఏళ్లుగా! కండరాలు చచ్చుబడిపోయి.. కాళ్లు, చేతులు పనిచేయక పూర్తిగా మంచం పడితే.. పొద్దున ముఖం కడిగించడం మొదలు.. కాలకృత్యాలకు తీసుకెళ్లడం.. స్నానం చేయించడం.. అన్నం తినిపించడం.. అన్నీ అతడికి ఆ తల్లే చేస్తోంది! మస్క్యూలర్ డిస్ట్రఫీ (కండరాల క్షీణత) అనే ఏమాత్రం నయం కాని జబ్బుతో అ కుమారుడు బాధపడుతున్నాడు. తల్లితో ఇక సేవలు చేయించుకోవడం తనకు ఇష్టం లేదని.. తనను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు సాయంగా ఓ మనిషిని కేటాయించాలని.. లేదంటే కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకుంటున్నాడు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం జిల్లా మండలం నేరడ గ్రామానికి చెందిన జంపాల గోపాల్ పరిస్థితి ఇది. పందొమ్మిదో యేట అతడు వ్యాధి బారిన పడటంతో శరీరంలో ఉన్న కండరాలన్నీ చచ్చుబడిపోయాయి. కుమారుడు స్వస్థత పొందుతాడనే ఆశతో తల్లి అంజమ్మ ఊర్లో ఉన్న మూడు గుంటల భూమిని విక్రయించింది. అప్పులూ చేసింది. తనకు, తన కుటుంబానికి సహాయం చేయడానికి పెద్ద మనసున్న దాతలెవరైనా ముందుకు రావాలని గోపాల్ వేడుకుంటున్నాడు. ఏపీలో అమలవుతున్న మాదిరిగా తనకు రూ.15వేలు పింఛన్ ఇవ్వాలని కోరారు. మంచానికే పరిమితమైన తనను తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం సాయం చేయాలని (ఫోన్ పే, గూగూల్ పే-8341175190/ కెనరా బ్యాంకు చిట్యాల బ్రాంచ్, అకౌంట్ నంబర్ 066510106036, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ సీఎన్‌ఆర్‌బీ 0000665) విజ్ఞప్తి చేస్తున్నాడు.