Share News

తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:23 AM

మందులకు లొంగని సూక్ష్మజీవులు, వైరస్‌లు మనుషులను వేధించుకుని తింటున్నాయి. యాంటీబయాటిక్స్‌ విషయంలోనూ రాటుదేలి.. మొండికేస్తున్నాయి.

తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

చికెన్‌, మటన్‌, అన్నింటా.. ప్రతి కిలోకు 114 మిల్లీ గ్రాములు

జంతువుల్లో చిన్న జబ్బుకూ యాంటీబయాటిక్స్‌

వాటిలో యాంటీ-మైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌

వాటి మాంసం తినే వారిపైనా ప్రభావం

జీర్ణకోశ, చర్మవ్యాధులు, క్యాన్సర్‌ ముప్పు

తాజా అధ్యయనంలో వెల్లడి

2020లో 190 దేశాల్లో పరిశోధన

30వ స్థానంలో భారత్‌

యాంటీబయాటిక్స్‌తో కోళ్లు, గొర్రెలు.. త్వరగా పెరుగుతాయనేది అపోహే: వైద్యులు

పోషకాల కోసం మాంసం అవసరమే.. కానీ పరిమితంగా తీసుకోవాలి: నిపుణులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మందులకు లొంగని సూక్ష్మజీవులు, వైరస్‌లు మనుషులను వేధించుకుని తింటున్నాయి. యాంటీబయాటిక్స్‌ విషయంలోనూ రాటుదేలి.. మొండికేస్తున్నాయి. దీన్నే యాంటీ మైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌) అంటారు. ఈ మధ్యకాలంలో ఏఎంఆర్‌పై చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అతిగా యాంటీబయాటిక్స్‌ తీసుకునేవారిలో ఈ పరిస్థితి ఉంటుంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా యాంటీబయాటిక్స్‌ విక్రయించకూడదని ఫార్మసిస్టులకు ఆదేశాలిచ్చింది. అయితే.. తినే మాంసంలోనూ యాంటీబయాటిక్స్‌ అవశేషాలు ఉంటున్నాయని, ఈ పరిణామం మానవుల్లో రుగ్మతలకు కారణమవుతాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. 190 దేశాల్లో 2020 సంవత్సరంలో ఈ పరిశోధన చేయగా.. మాంసంలో యాంటీబయాటిక్స్‌ ఆనవాళ్లున్న జాబితాలో భారత్‌ 30వ స్థానంలో ఉంది. అంటే.. సగటున ప్రతి కిలో మాంసంలో 114 మిల్లీగ్రాముల మేర యాంటీబయాటిక్స్‌ ఆనవాళ్లున్నాయి.

మటన్‌లో ఎక్కువ

భారత్‌లో ప్రతి కిలో మటన్‌(గొర్రె/మేక మాంసం)లో యాంటీబయాటిక్స్‌ ఆనవాళ్లు 243 మిల్లీ గ్రాముల మేర ఉన్నట్లు ఈ పరిశోధన జరిపింది. ఆ తర్వాతి స్థానాల్లో పందిమాంసం(173 మిల్లీ గ్రాములు), గొడ్డుమాంసం(60 మిల్లీగ్రాములు), కోడిమాంసం/చికెన్‌(35 మిల్లీగ్రాములు) ఉన్నాయి. ఇలా యాంటీబయాటిక్స్‌ ఆనవాళ్లున్న మాంసాన్ని తిన్న మానవుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలుంటాయని పరిశోధకులు హెచ్చరించారు. పశ్చిమబెంగాల్‌లోని పశు, మత్స విజ్ఞానశాస్త్ర విశ్వవిద్యాలయంలోని లైవ్‌స్టాక్‌ ఉత్పత్తుల విభాగం కూడా ‘మాంసం ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్‌ అవశేషాలు’ పేరుతో ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. జాతీయ మాంసం పరిశోధన శాస్త్రవేత్తలు, వెటర్నరీ పరిశోధన సంస్థ, భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. పశువులకు ఇచ్చే యాంటీబయాటిక్స్‌.. వాటిని తినే మానవుల శరీరంలోకి ప్రవేశిస్తాయని వీరు గుర్తించారు. పశువులకు యాంటీబయాటిక్స్‌ ఇచ్చిన 14 రోజుల వరకు వాటి మాంసాన్ని వినియోగించకూడదని సూచించారు. ‘‘మేము చికెన్‌లో సిప్రోఫ్లాక్సాసిన్‌, ఎన్రోఫ్లాక్సాసిన్‌, డాక్సీసైక్లిన్‌, స్టెప్టోమైసిన్‌ లాంటి యాంటీబయాటిక్స్‌ అవశేషాలను చూశాం. పశువుల్లో టెట్రాసైక్లిన్‌ యాంటీబయాటిక్స్‌ అవశేషాలను గుర్తించాం’’ అని పరిశోధకులు వెల్లడించారు.


ఎందుకు వాడుతారు?

మనదేశంలో పాడి రైతుల్లో అవగాహనారాహిత్యంతో పశువులకు అధికంగా యాంటీబయాటిక్స్‌ ఇస్తుంటారని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఒక కోడిపిల్ల 40 రోజులకే ఎదిగి మార్కెట్‌కు రావాలంటే.. యాంటీబయాటిక్స్‌ ఇంజక్షన్‌ ఇవ్వక తప్పదని ఓ కోళ్లఫారం యజమాని చెప్పారు. దీని వల్ల కోడి బరువు పెరగదని, కోడిలో ఆకలి పెరిగి.. ఎక్కువగా తిని, త్వరగా లావు అవుతుందన్నారు. పైగా.. కోడి ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటుందన్నారు. ఇక చాలా చోట్ల పశువుల శాలలు అపరిశుభ్రంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పశువులు తరచూ జబ్బు చేస్తుంటాయి. దాంతో.. పాడి రైతులు వాటికి యాంటీబయాటిక్స్‌ ఇంజక్షన్లు ఇస్తుంటారు. నిజానికి పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉండేలా చూసి, సరిపడా వెంటిలేషన్‌ ఏర్పాట్లు చేస్తే.. ఈ సమస్యలను అధిగమించవచ్చని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. 2010లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న యాంటీబయాటిక్స్‌లో 70ు పశువులకే వినియోగిస్తున్నారు. ‘‘పలు చోట్ల పాడిరైతులు ఎక్కువ పాల ఉత్పత్తికి పశువులకు ఆక్సిటోసిన్‌లు ఇస్తుంటారు. ఆ పాలను తాగే ఆడపిల్లలు 9-10 సంవత్సరాల వయసులోనే రజస్వల అవుతుంటారు. కోళ్లు, గొర్రెలకు కూడా ఆక్సిటోసిన్‌ ఇస్తుంటారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వెటర్నరీ వైద్యుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. యాంటీబయాటిక్స్‌ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల కోళ్లు, గొర్రెలు/మేకలు త్వరగా పెరుగుతాయనేది అపోహేనని మరో వెటర్నరీ వైద్యుడు డాక్టర్‌ మల్లేశ్‌ చెప్పారు.

మానవులకు ప్రమాదమే

మాంసంలోని యాంటీబయాటిక్స్‌ అవశేషాలు మానవుల్లో చేరితే.. దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారుతాయని కిమ్స్‌ ఆస్పత్రిలో ఇంటర్నల్‌ మెడిసన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ శివరాజ్‌ చెప్పారు. పశు, మత్స విజ్ఞానశాస్త్ర విశ్వవిద్యాలయంలోని లైవ్‌స్టాక్‌ ఉత్పత్తుల విభాగం పరిశోధనలో కూడా.. మాంసంలోని యాంటీబయాటిక్స్‌ వల్ల మానవుల్లో జీర్ణక్రియ సమస్యలు, కొన్నిరకాల క్యాన్సర్లు, నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని తేలింది. మాంసంలో ఉండే బీటా లాక్టమ్స్‌ కారణంగా చర్మవ్యాధులు వస్తాయని, టెట్రాసైక్లిన్‌ అవశేషాల కారణంగా గర్భంలోని పిండం సరిగా ఎదగక పోవడం, పిల్లల పళ్లపై మరకలు, పేగులలో సమస్యలు రావొచ్చని నిర్ధారణ అయ్యింది. పశువులు, కోళ్లలో వాడే పలు రకాల యాంటీబయాటిక్స్‌ వల్ల పలురకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరించారు.


ఈ జాగ్రత్తలు పాటించాలి

మన రాష్ట్రంలో మాంసం వినియోగం ఎక్కువే..! చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. వేడుక ఏదైనా.. ముక్క ఉండాల్సిందే..! అయితే.. మాంసంలో యాంటీబయాటిక్స్‌ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు

పాడి రైతులు పశువుల కొట్టాలు/పాకలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తగినంత వెంటిలేషన్‌ ఉండేలా జాగ్రత్తపడాలి. దీని వల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయి

పశువుల మేతలో యాంటీబయాటిక్స్‌ గ్రోత్‌ ప్రమోటర్లను వాడొద్దని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ ఆఫ్‌ పౌలీ్ట్ర ఫీడ్‌ చేసిన హెచ్చరికలను పాటించాలి

మాంసాన్ని వండడం.. శీతలీకరించే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఉడికించడం ద్వారా బీటా లాక్టమేజ్‌, టెట్రాసైక్లిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ ప్రభావాన్ని తగ్గించవచ్చు

ప్రభుత్వాలు కూడా ర్యాండమ్‌గా మాంసంలో యాంటీబయాటిక్స్‌ అవశేషాలపై పరీక్షలు నిర్వహించాలి

మైక్రోబియామ్‌పై ప్రభావం చూపుతున్నాయి

మాంసంలో యాంటీబయాటిక్స్‌ వల్ల మానవులకు కచ్చితంగా నష్టం జరుగుతుంది. పశువులు/కోళ్లకు ఇచ్చిన యాంటీబయాటిక్స్‌ ఏమిటనేది తెలిస్తే.. ప్రభావం ఎంతవరకు ఉంటుందో చెప్పవచ్చు. ఉదాహరణకు అజిత్రోమైసిన్‌ ప్రభావం వారాలు, నెలల వరకు ఉంటుంది. యాంటీబయాటిక్‌-మెటబాలిజాన్ని బట్టి ఈ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా యాంటీబయాటిక్స్‌ రెసిస్టెన్స్‌ ముప్పు పొంచి ఉంటుంది. అయితే.. తెలంగాణలో మాంసం వినియోగం ఎక్కువే. కానీ, ఇక్కడ యాంటీబయాటిక్స్‌ రెసిస్టెన్స్‌ ప్రభావం ఎక్కువగా ఉందా? అంటే.. శాస్త్రీయ నిరూపణలు లేవు. మాంసంలో ఉండే యాంటీబయాటిక్స్‌ కారణంగా.. గట్‌ మైక్రోబియామ్‌(కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా)పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. పలు రుగ్మతలు, మధుమేహం వంటి వ్యాధులకు ఇది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.

- డాక్టర్‌ శివరాజ్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌, కిమ్స్‌


పరిమితంగానే తీసుకోవాలి

తీసుకునే ఆహారంపై పరిమితి ఉండాలి. మాంసంతో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ సహా కొన్ని పోషకాలు లభిస్తాయి. అయితే.. ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం పొంచిఉంటుంది. మటన్‌ వినియోగం తక్కువగా ఉండాలి. చికెన్‌ రోజుకు గరిష్ఠంగా 50 గ్రాములు, వారానికి 200 గ్రాములకు పరిమితం చేసుకోవాలి. మాంసం వండే పద్ధతుల్లో మార్పులు అవసరం. యాంటీబయాటిక్స్‌ అవశేషాలు తొలిగిపోయేలా.. పోషకాలు ఏమాత్రం లోపించకుండా.. స్టీమ్డ్‌, గ్రిల్డ్‌ లాంటి పద్ధతులు ఒకవిధంగా మంచివే. బార్బిక్యూ లాంటి విధానాలు సరికాదు.

- డాక్టర్‌ ఎం.గాయత్రి, ఆపోలో ఆస్పత్రి డైటీషియన్‌

Updated Date - Dec 11 , 2024 | 05:41 AM