Nagarjuna Sagar: ‘సాగర్’ నిర్వహణ పనులు వేగంగాపూర్తిచేయాలి..
ABN , Publish Date - Jun 18 , 2024 | 03:26 AM
వానాకాలం వరద సీజన్‌కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కేఆర్‌ఎంబీ( కృష్ణానది యాజమాన్య బోర్డు) ఛైర్మన్ అశోక్ గోయల్ అధికారులకు సూచించారు.
కేఆర్‌ఎంబీ చైర్మన్ అశోక్ గోయల్
నాగార్జునసాగర్, జూన్ 17 : వానాకాలం వరద సీజన్‌కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కేఆర్‌ఎంబీ( కృష్ణానది యాజమాన్య బోర్డు) ఛైర్మన్ అశోక్ గోయల్ అధికారులకు సూచించారు. ఆయన నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టును సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సాగర్ ప్రధాన డ్యాం క్రస్ట్ గేట్ల పైకి ఎక్కి వాటి పని తీరు ఎలా ఉందని ప్రాజెక్టు ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.
ప్రధాన డ్యాంపై సూట్ గేట్లు, క్రేన్ ట్రాక్, క్రస్ట్ గేట్లకు గ్రీజు, రబ్బర్ సీళ్ల చెకింగ్ వంటి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. స్పిల్‌వే మరమ్మతు పనులను పరిశీలించి అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న గుంతలను పూడ్చే పనులను వరదలు వచ్చే నాటికి పూర్తిచేయాలన్నారు. అనంతరం ప్రధాన జల విద్యుత్ కేంద్రంలోకి వెళ్లి అక్కడ ఈ ఏడాది చేసిన విద్యుదుత్పత్తి వివరాలను జెన్‌కో అధికారులను అడిగి తెలుసుకున్నారు.