Share News

Bhatti Vikramarka: పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు భట్టి.. విద్యార్థుల మరణాల మిస్టరీ వీడుతుందా?

ABN , Publish Date - Aug 13 , 2024 | 07:09 AM

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు నేడు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించనున్నారు. పది రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

Bhatti Vikramarka: పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు భట్టి.. విద్యార్థుల మరణాల మిస్టరీ వీడుతుందా?

జగిత్యాల: డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు నేడు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించనున్నారు. పది రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఒకరు పాము కాటు, మరొకరు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలోనే విద్యార్థులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరో నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల మృతిపై ఏబీఎన్‌లో వరుస కథనాలు వెలువడ్డాయి. వసతి గృహం దుస్థితిపై అసలు నిజాలను ఏబీఎన్ వెలుగులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. నేడు గురుకుల పాఠశాలకు భట్టి, పొన్నంలు వెళ్లనున్నారు.


జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం కాస్త తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వెంటనే తమ పిల్లలను ఇళ్లకు తీసుకు వెళ్లారు. అసలు పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. కడుపు నొప్పి అంటూ విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే ఒక చిన్నారి.. చికిత్స పొందుతూ మరో చిన్నారి మృతి చెందాడు. ఇదిలా ఉండగానే మరో ముగ్గురు విద్యార్థులు కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మిగిలిన ఇద్దరు చికిత్సతో సెట్ అయ్యారు.


అసలు పాఠశాలలో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియకుండా ఉంది. విద్యార్థుల బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం వైద్యులు ల్యాబ్‌కు పంపించారు. మరి ఆ టెస్ట్ రిపోర్టులు ఏమయ్యాయో కూడా తెలియడం లేదు. దాదాపు 15 రోజుల క్రితం విద్యార్థి మరణించిన విషయమై స్పందించిన ప్రిన్సిపల్ విద్యాసాగర్.. ఫిట్స్ వచ్చి చనిపోయాడని తెలిపారు. కానీ ఆ వివరణ వాస్తవ విరుద్దంగా ఉంది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేశారు. విద్యాసాగర్ స్థానంలో మహేందర్ రెడ్డిని ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా నియమించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అసలు పాఠశాలలో విద్యార్థుల మరణాలు మిస్టరీగా మారాయి. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పాఠశాలలో విద్యార్థులకు రక్షణ లేదని ఇళ్లకు తీసుకు పోతున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం, మంత్రి వెళ్లి ఏం తేలుస్తారో చూడాలి.

Updated Date - Aug 13 , 2024 | 07:09 AM