Share News

Bhatti Vikramarka: అమాయకులను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:26 AM

బీఆర్‌ఎస్‌ నేతలు అధికారం కోల్పోవడంతో అమాయకులను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చడంపైనే ఆ పార్టీ దృష్టి పెట్టిందన్నారు.

Bhatti Vikramarka: అమాయకులను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్‌

  • కేటీఆర్‌.. ఏది సర్కారు వైఫల్యం: భట్టి

  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర: పొంగులేటి

  • కేటీఆర్‌కు శిక్ష తప్పదు: మహేశ్‌ గౌడ్‌

  • రేపట్నుంచి ప్రజల్లోకి.. 2న బహిరంగ సభ!

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేతలు అధికారం కోల్పోవడంతో అమాయకులను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చడంపైనే ఆ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ వైఫల్యమేంటో కేటీఆర్‌ చెప్పాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడమా? ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ పెట్టడమా? రుణమాఫీ చేయడమా? ప్రజలకు మంచి చేయడమేనా.. ప్రభుత్వ వైఫల్యం. కేటీఆర్‌ గురించి చాలా మాట్లాడవచ్చు. ఫార్మా క్లస్టర్స్‌ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని. ప్రతీకార రాజకీయాలకు మేం వ్యతిరేకం’ అని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలను పెంచడానికే ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుందని.. దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌ కాబోతుందని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్ర జరుగుతోందని, అధికారం పోయిందన్న అక్కసుతో అమాయక రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. చిల్లర, అవకాశవాద, కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేమనే విషయాన్ని బీఆర్‌ఎస్‌ గుర్తించాలని హితవు పలికారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

లగచర్ల ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుందని.. ఎవరినీ ఉపేక్షించబోమని ఓ ప్రకటనలో తెలిపారు. ఇవ్వాళ అధికారులపై జరిగినట్లు రేపు నేతల మీద జరిగితే ఈ సర్కారు ఉపేక్షించబోదన్నారు. కలెక్టర్‌ను హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారన్నారు. గులాబీ గూండాల కుట్రలను రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. 11 నెలలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ నియంతృత్వ పాలనలో ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేశారని.. నేరెళ్లలో దళితులను ఇసుక ట్రాక్టర్‌తో తొక్కించి పోలీసులతో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ అసాంఘిక శక్తిగా మారిందని, దాని నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోందన్నారు. పరిశ్రమలు వస్తే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో కేటీఆర్‌ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్‌ మండిపడ్డారు. లగచర్లలో అధికారులను అంతమొందించే పన్నాగం పన్నారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మల్లన్నసాగర్‌ కోసం 12 గ్రామాల ప్రజలను బెదిరించి భూసేకరణ చేశారని.. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా కేటీఆర్‌ తీరు ఉందని ఎద్దేవా చేశారు. బందిపోట్లలా తెలంగాణను బీఆర్‌ఎస్‌ నేతలు దోచుకున్నారని.. కేటీఆర్‌ పాదయాత్ర కాదు.. మోకాళ్ల మీద యాత్ర చేసినా జనం నమ్మబోరని వ్యాఖ్యానించారు.


  • మొదటి ముద్దాయి కేటీఆరే..

లగచర్లలో కలెక్టర్‌పై దాడి చేసిన వారు.. ఎవరైనా వదిలేది లేదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్‌ అని.. ఆయన నుంచి ఫోన్‌ వెళ్లగానే పట్నం నరేందర్‌ రెడ్డి తన కార్యకర్తలతో దాడి చేయించారన్నారు. ఈ-ఫార్ములా విషయంలో కేటీఆర్‌ డబ్బులు నొక్కేశారని.. ఆయనకు శిక్ష తప్పదని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ నుంచి ఇది ప్రారంభమవుతుందన్నారు. జిల్లా పర్యటనలు ముగిశాక డిసెంబర్‌ 2 లేదా 3న భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నామని.. దీనికి అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానించనున్నట్టు తెలిపారు. అధికారం కోల్పోగానే బీఆర్‌ఎస్‌ నేతలు సైకోలుగా మారారని టీపీసీసీ నేత సామ రామ్మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. పచ్చటి తెలంగాణలో నెత్తురు పారించే కుట్రలు చేస్తున్నారని.. సీఎం సొంత నియోజకవర్గంలో అలజడి రేపి రాష్ట్రాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Updated Date - Nov 15 , 2024 | 03:26 AM