Share News

Children Missing: తెలంగాణలో పెరిగిపోతున్న చిన్నారుల కిడ్నాప్ కేసులు..

ABN , Publish Date - Aug 05 , 2024 | 10:33 AM

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వరసగా అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల అపహరణ కేసులు పెరిగిపోతున్నాయి. పురిటి బిడ్డలను కూడా వదలడం లేదు. ఏదో ఒకటి ఆశ చూపి అభశుభం తెలియని పసివారని ఎత్తుకెళ్లిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి.

Children Missing: తెలంగాణలో పెరిగిపోతున్న చిన్నారుల కిడ్నాప్ కేసులు..

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వరసగా అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల అపహరణ కేసులు పెరిగిపోతున్నాయి. పురిటి బిడ్డలను కూడా వదలడం లేదు. ఏదో ఒకటి ఆశ చూపి అభశుభం తెలియని పసివారని ఎత్తుకెళ్లిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. పిల్లలు కిడ్నాప్‌కు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రోజున బాలుడి అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది. జిల్లెలగూడకు చెందిన బాలుడు రోజు మాదిరిగానే ట్యూషన్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి చిన్నారిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. ఎంతసేపటకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బాలుడి కోసం వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు తనిఖీ చేశారు. ఓ వ్యక్తి చిన్నారిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్లినట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ ఇంతవరకూ తెలియకపోవడంతో తమ కుమారుడిని నిందితుడు ఏం చేస్తాడో ఏమో అని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


జగిత్యాల హజారీ కాలనీలో ఇవాళ(సోమవారం) ఉదయం ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. చెత్త ఏరుకునేందుకు వచ్చిన వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.


హైదరాబాద్ అబిడ్స్ కట్టెలమండి ప్రాంతంలో ఆదివారం రోజున మరో కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టించింది. బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రగతి(6) కట్టెలమండిలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆడుకునేందుకు ఇంటి సమీపంలోని ఆలయం వద్దకు వెళ్లింది. చాక్లెట్ ఇస్తానని చెప్పిన దుండగుడు బాలికను ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. బంధువుల ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమూల్ గ్రామానికి కిడ్నాపర్‌ను తీసుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం బాలికను రక్షించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ప్రాంతంలోనూ జులై 31న సాయంత్రం ముక్రశ్లోక(17) అనే బాలిక అదృశ్యమైంది. అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన బాలిక సరకుల కోసం దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు యువతి కోసం ఎంత వెతికినా ఫలతం లేకుండా పోయింది. దీంతో ఘట్‌కేసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు. బాలిక వివరాలు ఇంకా తెలియకపోవడంతో తల్లిదండ్రులు విలపిస్తు్న్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘటనలు మన కళ్లముందు కనిపిస్తాయి.


తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అలాగే చిన్నారులు, యువతులను కిడ్నాప్ చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పురిటి బిడ్డలను కూడా తల్లుల ఒడిలో నుంచి తీసుకెళ్తు్న్న ఘటనలు మనసులను కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కిడ్నాపర్లకు భయం పుట్టించాలని కోరుతున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 10:49 AM