Share News

Collector: చెత్తను ఎత్తిపోసిన కలెక్టర్‌..

ABN , Publish Date - Aug 06 , 2024 | 08:40 AM

కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమైన స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్(Amberpet MLA Kaleru Venkatesh)‏తో కలిసి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌(Collector Anudeep Durishetti) దురిశెట్టి చెత్తను ఎత్తి ట్రాలీలో పోశారు.

Collector: చెత్తను ఎత్తిపోసిన కలెక్టర్‌..

- ‘స్వచ్ఛదనం - పచ్చదనం’ ప్రారంభం

హైదరాబాద్: కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమైన స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్(Amberpet MLA Kaleru Venkatesh)‏తో కలిసి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌(Collector Anudeep Durishetti) దురిశెట్టి చెత్తను ఎత్తి ట్రాలీలో పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని అన్ని డివిజన్లలోనూ ఈ కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను, ఉన్నత పాఠశాలను ఆధునీకరిస్తామని, ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

ఇదికూడా చదవండి: Wedding Dates: పెళ్లికి వేళాయె..


ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌లో నూరు శాతం ఫలితాలు సాధించేలా అధ్యాపకులు, ప్రధాన ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ కన్నె ఉమాదేవి, ఇంటర్మీడియట్‌ బోర్డు జిల్లా అధికారి వడ్డెన్న, డీఎంసీ మారుతీ దివాకర్‌, ఏఎంహెచ్‌వో హేమలత, డిప్యూటీ డీఈవో కె.విజయలక్ష్మి, డిప్యూటీ ఐవో సుమన్‌నాయక్‌, కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చిరంజీవి, హిమాయత్‌నగర్‌ తహసీల్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

city1.2.jpg


అది సామాజిక బాధ్యత: మేయర్‌

బంజారాహిల్స్‌: స్వచ్ఛదనం-పచ్చదనం అందరి సామాజిక బాధ్యత అని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) అన్నారు. ఖైరతాబాద్‌ జోన్‌ ఎన్‌బిటీనగర్‌లో కమిషనర్‌ ఆమ్రపాలి కాట, జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నాలుగువేలకు పైగా ఆటోల ద్వారా చెత్త సేకరణ జరుగుతున్నా, చాలామంది చెత్తను బయటే పడేస్తున్నారని అన్నారు. ఎన్‌బీటీనగర్‌ను పరిశుభ్రతలో ఆదర్శవార్డుగా తీర్చిదిద్దటానికి ప్రజల సహకారం అవసరమన్నారు. కమిషనర్‌ ఆమ్రపాలి మాట్లాడుతూ ప్రజలు రోడ్ల మీద చెత్త వేయవద్దని అవగాహన కల్పిస్తున్నామన్నారు. దోమల నివారణ, వ్యాధుల నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. వీధికుక్కల బారిన చిన్నారులు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని కోరారు. కుక్కకాటు నివారణకు, కుక్కల స్టెరిలైజేషన్‌కు ప్రత్యేక యాప్‌ను తీసుకురాబోతున్నామన్నారు. ఈ సందర్భంగా డెంగీకి సంబంధించిన స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ప్రశాంతి, చీఫ్‌ ఎంటమాలజీ డాక్టర్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


తొలిరోజు ఇలా..

మొదటి రోజు 340 కాలనీలు/బస్తీల్లో 1,104 మెట్రిక్‌ టన్నుల చెత్త, 800 టన్నుల నిర్మాణ రంగ వ్యర్థాలు తొలగించినట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటనలో పేర్కొంది. 232 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కనున్న ప్రాంతాలు, సెంట్రల్‌ మీడియన్లను శుభ్రపరిచారు. పరిచయంలో 13,574 ఇళ్లకు వెళ్లినట్లు, 373 మంది స్వచ్ఛ ట్రాలీ కార్మికులను స్థానిక కాలనీ/బస్తీ సంఘాలకు అనుసంధానం చేశారు. 28 చోట్ల రోడ్ల పక్కనున్న చెత్త కుప్పల తొలగించి, మరో 1080 ప్రాంతాల్లో చెత్త తరలించారు. 124 కమ్యూనిటీ హాళ్లు, 127 పాఠశాలలు/కళాశాలలు, 50 శ్మశాన వాటికలు, 21 చోట్ల రైల్వేట్రాక్‌ పరిసరాలు, 53 వారాంతపు సంతలు జరిగే ప్రాంతాలను శుభ్రపరిచారు.


58,809 ఇళ్లలో యాంటీ లార్వల్‌ ఆపరేషన్‌ (ఏఎల్‌ఓ), 211 కాలనీలు/బస్తీలు, 9 చెరువుల వద్ద ఫాగింగ్‌ నిర్వహించారు. 464 వీధి కుక్కలకు స్టెరిలైజేషన్‌/యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ వేశారు.స్టెరిలైజ్‌ చేయని 369 వీధి కుక్కలను గుర్తించారు. 29.44 కి.మీల మేర నాలాల్లో వ్యర్థాల తొలగింపు, రోడ్లపై 245 గుంతల మరమ్మతు, 42 వరద నీరు నిలిచిన ప్రాంతాలను శుభ్రం చేశారు. 34,719 మొక్కలను పంపిణీ చేసి, 9,415 మొక్కలు నాటారు. మీడియన్ల వద్ద 2098 మీటర్ల మేర ప్లాంటేషన్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. దోమల నివారణ, డిజిటల్‌ ఇంటి నెంబర్ల కేటాయింపు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 06 , 2024 | 08:40 AM