Share News

Crop Centers: మక్కల సేకరణకు రూ.1,800 కోట్లు!

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:48 AM

ఈ సీజన్‌లో మొక్కజోన్న కొనుగోళ్లకు రూ.1800 కోట్లు అవసరమంటూ మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మక్కల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.

Crop Centers: మక్కల సేకరణకు రూ.1,800 కోట్లు!

  • రాష్ట్ర ప్రభుత్వానికి మార్క్‌ఫెడ్‌ ప్రతిపాదనలు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఈ సీజన్‌లో మొక్కజోన్న కొనుగోళ్లకు రూ.1800 కోట్లు అవసరమంటూ మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మక్కల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమిస్తూ, రూ.1,800 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 5,46,865 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. 9.63 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కల ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తే 7.22 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలు వస్తాయని మార్క్‌ఫెడ్‌ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.


క్వింటాలుకు రూ.2,225 కనీస మద్దతు ధర ఉండగా ప్రస్తుతం మార్కెట్‌ ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి. మక్కలు మార్కెట్‌కు వచ్చే కొద్దీ ధరలు మరింత తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్‌ అధికారులు వెల్లడించారు. మొక్కజొన్నలు మార్కెట్‌కు వస్తున్న జగిత్యాలలో 9, ఆదిలాబాద్‌లో 1, నిర్మల్‌లో 2 కలిపి తొలివిడతలో 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివా్‌సరెడ్డి ‘ఆంఽధ్రజ్యోతి’కి తెలిపారు. మొత్తం సీజన్‌లో 102 సెంటర్లు ఏర్పాటుచేసి మొక్కజొన్నల కొనుగోళ్లు చేపడతామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘నాఫెడ్‌’ కు కూడా ప్రతిపాదనలు పంపామని, 50 వేల మెట్రిక్‌ టన్నుల మక్కల సేకరణకు నాఫెడ్‌ అనుమతి ఇచ్చిందని ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. టీజీ మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్నలు సేకరించి వాటిని డిస్టిలరీలకు అమ్మాలనే ఆలోచనతో నాఫెడ్‌ ఉన్నట్టు సమాచారం.

Updated Date - Oct 19 , 2024 | 03:48 AM