Hydra: సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 29 , 2024 | 06:13 PM
మహా నగరం హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన ఇల్లు చట్టవిరుద్ధంగా ఉంటే కూల్చివేయాలని అన్నారు.
హైదరాబాద్: మహా నగరం హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన ఇల్లు చట్టవిరుద్ధంగా ఉంటే కూల్చివేయాలని అన్నారు.
‘‘నాకు టైమ్ ఇస్తే ఇంట్లో సామాను తీసుకుని బయటకి వెళ్తాను. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు నన్ను ఏ అధికారీ కలవలేదు. నేను 2016-17లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశాను. నివాసానికి కొనుగోలు చేసినప్పుడు ఈ బిల్డింగ్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందన్న సమాచారం నా దగ్గర లేదు. నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చారు. 1995లోనే ఈ లే ఔట్‌కి పర్మిషన్ వచ్చింది. బీఆర్ఎస్ వాళ్లు నా ఇంటిని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. గత పదేళ్లలో ఎన్నో అక్రమాలు చేశారు’’ అని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.
హైడ్రాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు.. స్పందించిన సీఎం రేవంత్
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాపై జనాల్లో సానుకూల స్పందనే వస్తోంది. ఇదే సమయంలో హైడ్రాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు అందుతున్నాయి.
వరుసగా వస్తున్న ఈ ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని అన్నారు. ఏసీబీ, విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.