Land Scam: మహేశ్వరం కేసు పునఃపరిశీలన!
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:54 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో వందల కోట్ల రూపాయల విలువైన భూ బదలాయింపుల కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థన మేరకు ఈ కేసును పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు.
పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు కోసమే!
ఈడీ అభ్యర్థనతో సమీక్షిస్తున్న పోలీసులు
రాచకొండ సీపీకి డీజీపీ జితేందర్ ఆదేశం
అవసరమైతే ఎఫ్‌ఐఆర్‌లో మరికొందరి పేర్లు!
కొత్తగా కేసులూ నమోదు చేసే అవకాశం
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో వందల కోట్ల రూపాయల విలువైన భూ బదలాయింపుల కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థన మేరకు ఈ కేసును పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అందిన ఫిర్యాదుల నేపథ్యంలో.. ఇందులో నిధుల బదలాంపునకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) ప్రకారం ముందుకెళ్లే యోచనలో ఈడీ అధికారులు ఉన్న విషయం తెలిసిందే. ఇందుకోసం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు కావాల్సిన అవసరం ఉండడంతో ఈడీ అధికారుల బృందం శనివారం రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను కలిసి చర్చించింది. కేసుకు సంబంధించిన వివరాలతో లేఖను అందజేసింది. మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన కేసును పునఃపరిశీలించడంతోపాటు రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్‌కుమార్ పాత్రపైనా కూలంకశంగా దర్యాప్తు చేయించేలా స్థానిక పోలీసులను ఆదేశించాలని డీజీపీని ఈడీ అధికారులు కోరారు.
ఈ మేరకు మహేశ్వరం కేసును మరోసారి పరిశీలించాల్సిందిగా రాచకొండ సీపీ సుధీర్‌బాబును డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదులు సివిల్ స్వభావం కలిగి ఉండడంతో అందుకనుగుణంగా చర్యలు తీసుకున్న పోలీసులు.. తాజాగా వాటిని మరోసారి సమీక్షిస్తున్నారు. ఈడీ అధికారులు ఇచ్చిన లేఖ, అందులో పేర్కొన్నవారి ప్రమేయంపైనా దృష్టి సారించారు. పాత కేసులను పూర్తిస్థాయిలో విశ్లేషించి, అవసరమైతే కొత్తగా మరికొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం లేదా కొత్తగా కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు అవసరమైన న్యాయసహాయాన్ని కూడా అధికారులు తీసుకుంటున్నారు. మహేశ్వరంతోపాటు శంకర్‌హిల్స్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్ భూములు, రాయదుర్గంలోని మరికొన్ని భూముల బదలాయింపులపైనా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.