Share News

సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:03 AM

‘‘సీఎం సారూ మా అమ్మ పేరుపై బాసరలోని ఎస్‌బీఐ బ్యాంకులో రూ. 2.25లక్షల వ్యవసాయ రుణం ఉంది. ఇటీవల రూ.25 వేలు చెల్లించినా మిగిలిన రూ.2 లక్షల రుణం మాఫీ కాలేదు.

సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!

  • ముఖ్యమంత్రికి రైతు వేడుకోలు

  • ఆ రైతు ట్రాక్టర్‌లోనే రెండేళ్ల క్రితం ట్రిపుల్‌ ఐటీకి రేవంత్‌

బాసర, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం సారూ మా అమ్మ పేరుపై బాసరలోని ఎస్‌బీఐ బ్యాంకులో రూ. 2.25లక్షల వ్యవసాయ రుణం ఉంది. ఇటీవల రూ.25 వేలు చెల్లించినా మిగిలిన రూ.2 లక్షల రుణం మాఫీ కాలేదు. ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే.. జాబితాలో తన పేరు లేదని చెబుతున్నారు. దయచేసి మీరు స్పందించి రుణ మాఫీ చేయించండి’’ అంటూ బాసర మండలం లాబ్ది గ్రామానికి చెందిన సిందే పీరాజీ అనే రైతు ముఖ్యమంత్రి రేవంత్‌ను వేడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.


రెండేళ్ల క్రితం రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సిందే పీరాజీ ట్రాక్టర్‌లోనే బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళ్లి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు పలికారు. ఆందోళనలకు వ్యతిరేకంగా ట్రిపుల్‌ ఐటీ ముందు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో రేవంత్‌ ట్రాక్టర్‌లో పంట పొలాల వైపు నుంచి అక్కడకు చేరుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి ఘటనను ప్రస్తావిస్తూ గురువారం సదరు రైతు ఓ వీడియోను పోస్టు చేశాడు. తనకు రుణమాఫీ కాలేదని, వెంటనే తన రుణాన్ని మాఫీ చేసేలా చూడాలని రేవంత్‌రెడ్డిని కోరాడు.

Updated Date - Dec 13 , 2024 | 05:03 AM