Share News

Maoists: నక్సలిజంలో మైనర్లు!

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:55 AM

సర్కార్‌, గ్రామ కమిటీలు స్ర్కూటినీ చేశాకే.. వారిని నియమించుకున్నాం. కొత్తగా నియమితులైన వారిలో 12, 13 ఏళ్ల వారు 65 మంది, 14-17 ఏళ్ల వయసులో ఉన్న వారు 40 మంది ఉన్నారు.

Maoists: నక్సలిజంలో మైనర్లు!

అడవుల్లో వారికి శిక్షణ.. మావోయిస్టు నేత సారయ్య లేఖతో వెలుగులోకి

చర్ల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్‌ కగార్‌’తో కుదేలవుతున్న మావోయిస్టులు.. ఇప్పుడు మైనర్లను రిక్రూట్‌ చేసుకుని, వారికి శిక్షణనిస్తున్నారని ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు వెల్లడించారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వరంగల్‌కు చెందిన సుధాకర్‌ అలియాస్‌ సారయ్య వద్ద లభ్యమైన నాలుగు పేజీల తెలుగు లేఖలో ఈ విషయం వెల్లడైందని వివరించారు. ‘‘మఢ్‌ డివిజన్‌లోని ఇంద్రావతి, మరో ప్రాంతం నుంచి 25 మందిని, ఇంకో చోట 130 మందిని రిక్రూట్‌ చేశాం. సర్కార్‌, గ్రామ కమిటీలు స్ర్కూటినీ చేశాకే.. వారిని నియమించుకున్నాం. కొత్తగా నియమితులైన వారిలో 12, 13 ఏళ్ల వారు 65 మంది, 14-17 ఏళ్ల వయసులో ఉన్న వారు 40 మంది ఉన్నారు. మిగతా 50 మంది వయసు 18-22 మధ్యలో ఉంది. వీరందరికీ 5 నెలలపాటు శిక్షణనిచ్చాం’’ అని ఆ లేఖలో ఉన్నట్లు తెలిపారు. సారయ్య ఆ లేఖను కేంద్ర కమిటీకి రాసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఈ లేఖ ఎప్పుడు రాశారనేదానిపై స్పష్టత లేదని తెలుస్తోంది.


‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన..!

  • ప్రస్తుతం ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ రీజియన్‌లో వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఒకప్పుడు గూగుల్‌ మూడోకంటికి కూడా అందని ప్రదేశాల్లోనూ ఇప్పుడు పోలీసు క్యాంపులు కనిపిస్తున్నాయి. అడవులకు దారితీసే ప్రధాన రహదారుల్లో సగటున ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు క్యాంపు ఉంది. ఈ క్యాంపుల వద్ద 20-30 మంది జవాన్లు డ్రోన్ల సాయంతో, అధునాతన తుపాకులతో పహారాకాస్తున్నారు. ప్రతీ క్యాంపులో సెల్‌ఫోన్‌ టవర్లను ఏర్పాటు చేశారు.

  • బలగాలు కౌర్‌గట్టు అడవుల్లోని చెట్లకు తెలుపురంగు స్టిక్కర్లు కనిపించాయి. మావోయిస్టుల తూటాల వెలుతురు ప్రతిబింబిస్తుందని, దానివల్ల ఎదురుకాల్పులు జరుగుతున్నాయని వారు భ్రమపడేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వివరించారు.

  • ఎన్‌కౌంటర్లలో మృతి చెందుతున్న మావోయిస్టుల్లో 90ు మంది ఎస్టీలే ఉన్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పర్యటనలో తేలింది. వీరిలోనూ సింహభాగం(95ు మంది) గొత్తికోయలు, కోయలు, గోండ్‌ తెగలకు చెందినవారున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 04:55 AM