Loan Waiver: రెండ్రూపాయలే..!
ABN , Publish Date - Aug 24 , 2024 | 04:04 AM
రుణ మాఫీ జాబితాలో తన పేరు ఉండడంతో ఆ రైతు ఉప్పొంగిపోయాడు. కానీ, ఆ సంతోషం ఆయనకు ఎంతో సేపు లేదు.
రుణ మాఫీలో ఖమ్మం జిల్లా రైతుకు వింత అనుభవం
చింతకాని, ఆగస్టు 23: రుణ మాఫీ జాబితాలో తన పేరు ఉండడంతో ఆ రైతు ఉప్పొంగిపోయాడు. కానీ, ఆ సంతోషం ఆయనకు ఎంతో సేపు లేదు. అక్షరాలా రూ.2 మాత్రమే మాఫీ అయిందంటూ తన ఫోన్‌కు వచ్చిన మెస్సేజ్‌ను చూసి ఆ రైతు అవాక్కయ్యాడు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడమే అతడికి శాపంగా మారింది.
ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని నాగులవంచకు చెందిన రైతు అంబటి రాజేష్ గ్రామంలోని సొసైటీ ద్వారా 2022లో రూ.1.10లక్షల అప్పు తీసుకున్నాడు. ఏడాది తర్వాత 2023 అక్టోబరులో ఆ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రుణమాఫీ అమలు ప్రకటన చేయగానే.. తాను కట్టిన డబ్బులు తిరిగి వెనక్కి వస్తాయని ఆ రైతు సంబరపడ్డాడు.
చివరికి రుణమాఫీ జాబితాలో తన పేరు ఉండడంతో ఉబ్బితబ్బిబ్బయ్యా డు. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం 2023 డిసెంబరు 9 నాటికి అప్పు ఉన్న రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తింపజేశారు. రాజేష్ రుణ ఖాతాలో రూ.2 అప్పుగా చూపించడంతో.. ఆ మేరకు మాఫీ చేస్తున్నట్లు అతడి ఫోన్‌కు సమాచారం అందింది. ‘‘రుణమాఫీ జాబితాలో నా పేరు చూసుకుని ఎంతో సంబరపడ్డా. ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది’’అని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.