Bhatti Vikramarka: వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు
ABN , Publish Date - Dec 16 , 2024 | 03:14 AM
రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించబోతున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
ఆర్థిక సాయం అందజేతకు 28న శ్రీకారం
ఆరు నెలలకోసారి రూ.6 వేలు పంపిణీ
అన్నదాతల కోసం రూ.50 వేల కోట్ల ఖర్చు
బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు
గత ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో
చర్చకు కేటీఆర్, హరీశ్‌లు సిద్ధమా?
నాటి అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖమ్మం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించబోతున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఆరు నెలలకు రూ.6 వేల చొప్పున ఏడాదిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినమైన డిసెంబరు 28న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక రైతులకు రైతుభరోసా కింద పెట్టుబడి సాయాన్ని వచ్చే సంక్రాంతి నుంచి అందజేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే కేటీఆర్, హరీశ్‌రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అప్పులపై బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను పక్కదారి పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు పెంచామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ.541 కోట్ల భారం పడిందని అన్నారు. అయినా ప్రభుత్వ హాస్టళ్లు బాగా లేవంటూ బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా యూనివర్సిటీ చేస్తున్న విషప్రచారాలను రాష్ట్ర ప్రజలు నమ్మరని అన్నారు.
అప్పులు తీర్చడానికి ఇబ్బందిపడుతున్నాం..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.72,658 కోట్ల అప్పులు ఉండగా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో ఆ అప్పు రూ.7లక్షల 11వేల 911 కోట్లకు పెరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. ఇప్పటివరకు రూ.66,282 కోట్ల అసలు, వడ్డీలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. దీనిపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఫీజు రీయింబర్స్‌మెంట్, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.40,154 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెట్టారని వెల్లడించారు. వీటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ విషయాలపై కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం అప్పులు, వడ్డీలకు కేవలం రూ.6,400 కోట్లు మాత్రమే చెల్లించే పరిస్థితి ఉండగా, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.66,782 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి రాష్ట్రం దిగజారిందని విమర్శించారు. ఇందుకు బీఆర్‌ఎస్ పాలనే కారణమని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, అప్పులపైనా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని తెలిపారు.
రైతుల కోసం 50,953 కోట్లు ఖర్చు చేశాం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని భట్టివికమ్రార్క చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. రుణమాఫీతోపాటు రైతుభరోసాకు రూ.7,625 కోట్లు, రైతుబీమాకు రూ.1,514 కోట్లు, ఆయిల్‌పామ్ సాగుకు రూ.40 కోట్లు, డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.55 కోట్లు, విత్తనాల కోసం రూ.36 కోట్లు, పంపుసెట్లు, విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు రూ.11,270 కోట్లు, ఇరిగేషన్ పనులకు రూ.9,795 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మొత్తంగా ఈ ఏడాది రైతుల కోసం రూ.50,953 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇవే కాకుండా వర్షాలు, వరదలతో పంటనష్టం జరిగిన చోట ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లించామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. దీనిద్వారా రైతులు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్‌లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నామని, హైదరాబాద్‌లో ఫ్యూచర్‌సిటీ, రీజినల్ రింగ్‌రోడ్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మూసీనది ప్రక్షాళన, ఇండస్ట్రియల్ హౌజింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.