Lakchera Attack: కాల్‌డేటా ఆధారంగా ‘లగచర్ల’పై విచారణ
ABN , Publish Date - Dec 08 , 2024 | 03:42 AM
లగచర్ల దాడి ఘటన కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని శనివారం పోలీసులు విచారించారు.
పట్నం నరేందర్‌రెడ్డిని ప్రశ్నించిన పోలీసులు
వికారాబాద్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): లగచర్ల దాడి ఘటన కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని శనివారం పోలీసులు విచారించారు. కాల్‌డాటాను ఆధారం చేసుకొని ప్రశ్నలు వేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర అఽధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో ప్రథమ నిందితుడైన ఆయనను రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు కొడంగల్ కోర్టు అనుమతించింది. దాంతో చర్లపల్లి జైలు నుంచి విచారణ నిమిత్తం వికారాబాద్ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు.
విచారణాధికారి అయిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆయనను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు, ఆ తర్వాత ఎవరెవరితో మాట్లాడారు? ఏమేమి మాట్లాడారనేదానిపై విచారణాధికారి తమ వద్ద ఉన్న కాల్ డేటా వివరాల ఆధారంగా ప్రశ్నించినట్లు సమాచారం. రెండో నిందితుడైన సురేశ్‌రాజ్ విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా కూడా ప్రశ్నలు వేశారు. ఎవరి ఒత్తిడి మేరకు లగచర్ల రైతులను అధికారులపైకి ఉసిగొల్పారు? ఈ ఘటన వెనక ఎవరున్నారు? అని ప్రశ్నించారు.