Share News

Hyderabad: నిధుల దారులన్నీ రుణమాఫీ వైపే!

ABN , Publish Date - Jun 16 , 2024 | 02:56 AM

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమైంది. ప్రకటించినట్టుగానే ఆలోగా మాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం ముందు మూడు మార్గాలు కనిపిస్తున్నాయి.

Hyderabad: నిధుల దారులన్నీ రుణమాఫీ వైపే!

  • రైతు కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి

  • రుణాలు బదలాయించడం ఓ దారి

  • ఎఫ్‌ఆర్‌బీఎం కింద వీలైనంత ఎక్కువ

  • రుణాన్ని సేకరించడం మరో మార్గం

  • ప్రభుత్వ భూముల తనఖా,

  • వేలం ద్వారా రుణమాఫీ ఇంకో దారి

  • అదీ కుదరకుంటే బిల్లులు ఆపి..

  • ఆ నిధులతో మాఫీకి సీఎం రెడీ?

  • ‘రైతు భరోసా’పై శాసనసభలో

  • చర్చించాకే నిర్ణయం తీసుకునే చాన్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమైంది. ప్రకటించినట్టుగానే ఆలోగా మాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం ముందు మూడు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. రైతు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలను బదలాయించడం. రెండు.. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి ఏడాదికి రూ.58 వేల కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మిగిలిన 9 నెలల కాలానికి సంబంధించి రావాల్సిన రుణమొత్తం రూ.48 వేల కోట్లలో.. జూలై, ఆగస్టు నెలల్లో సాధ్యమైనంత ఎక్కువ తీసుకునే ఆలోచన. ఎఫ్‌ఆర్‌ఎంబీ రుణాలను ఫలానాదానికే ఉపయోగించాలనే షరతులేవీ ఉండవు. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. జూలై, ఆగస్టు నెలల్లో ప్రత్యేక అవసరాలు ఉన్నాయని వివరించి తీసుకునే అవకాశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందుకు రిజర్వు బ్యాంకు అంగీకరిస్తుందనే ఆశాభావంతో ఉంది. గతంలో కూడా నిర్ణీత సమయం కంటే ముందే ఇలా అధికంగా నిధులు తీసుకున్న సందర్భాలున్నాయి.


ఒకవేళ అనుకున్న సమయంలో అనుకున్న మొత్తానికి అనుమతులు రాకుంటే.. మూడో పద్ధతిని అనుసరించాలని సర్కారు భావిస్తోంది. అదేంటంటే.. ప్రభుత్వ భూములను తనఖా పెట్టి నిధులు సేకరించడం, లేదా ప్రభుత్వ భూములు వేలం వేసి అవసరమైన నిధులు సమీకరణ చేయడం. అయితే.. ఇది సమయంతో కూడుకున్న పని. రుణమాఫీకి తుదిగడువు ఇంకా రెండు నెలలే ఉన్నందున ఈ ప్రక్రియ ఎంతవరకూ ఆచరణ సాధ్యమనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఈ మూడు పద్ధతుల్లోనూ నిధుల సేకరణ చేయలేకపోతే.. జూలై నెలలో ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంలో అత్యవసర ఖర్చులు పోను మిగతా మొత్తాన్ని రుణమాఫీకి మళ్లించాలనే ఆలోచన కూడా చేస్తోంది.


దాంతోపాటు ప్రభుత్వం సొంత వనరుల ద్వారా సమీకరించుకున్న నిధులను, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో కనీసం రూ.10 వేల కోట్ల రుణాన్ని సేకరించి ఆ మొత్తాన్ని, అన్ని బిల్లుల చెల్లింపులనూ ఆపేయడం ద్వారా మిగిలే నిధులను.. అన్నింటినీ కలిపి రుణమాఫీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాగా, జూలై నుంచి వేయాల్సిన రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బంధు కింద 2018-19నుంచి మొన్నటి వరకు రూ.80,450కోట్లు ఖర్చు చేయగా.. అందులో సాగులో లేని భూములు, గుట్టలకు రూ.25600 కోట్లు వేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అలాంటి భూములకు, పెద్ద రైతులకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే అంశంపై.. శాసన సభలో చర్చించిన తరువాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ ఆగస్టు దాకా కొనసాగే అవకాశం ఉందని అంచనా.


రుణ మాఫీ ఇలా..

తొలుత ఆగస్టు మొదటివారంలో.. రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేయాలని సర్కారు భావిస్తోంది. ఆ తరువాత రూ.లక్షన్నర, ఆగస్టు నాటికి రూ.2లక్షల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని యోచిస్తోంది. గతంలో బీఆర్‌ఎస్‌ సర్కారు ఈ పథకాన్ని అమలు చేసినా.. లక్షలోపు రుణాల మాఫీకే పరిమితమైంది. అది కూడా దశలవారీగా మాఫీ చేసింది. దాంతో బీఆర్‌ఎస్‌ సర్కారుపై ఒకేసారి ఆర్థిక భారం పడలేదు. కానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఒకేసారి రూ.2లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.35వేలకోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. రుణమాఫీ కోసం అందుబాటులో ఉన్న నిధులన్నీ వాడేస్తే.. ఆ తర్వాత ప్రభుత్వ అవసరాలకు అప్పులు చేయాల్సి ఉంటుంది.


ఆ సమయంలో పెద్ద ఎత్తున భూముల అమ్మకం, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, పన్నులు, ఎక్సైజ్‌ సుంకాలు, గనుల సీనరేజీ చార్జీలు, రవాణా పన్నుల్లో లీకేజీలను అరికట్టే చర్యలు తీసుకుంటూ.. అదనపు ఆదాయం సాధించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా భూముల విలువలను పెంచడంపై సర్కారు దృష్టి పెట్టింది. ప్రభుత్వ భూములు, ‘దిల్‌’ ఆధీనంలోని భూములు తనఖా పెట్టడం ద్వారా రూ.20-25 వేల కోట్ల దాకా సేకరించొచ్చని తెలిసింది. ఇక భూముల విలువ పెంపు ద్వారా అదనంగా ఏడాదికి రూ.5000 కోట్ల వరకు రాబడి పెరగవచ్చని భావిస్తున్నారు.

Updated Date - Jun 16 , 2024 | 02:56 AM