Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:08 AM
రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని, వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ హామీలను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ మోసం
రేవంత్‌రెడ్డికి ప్రజలంటే పట్టింపు లేదు
హైడ్రా పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు
రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు
తొర్రూరు/హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని, వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ హామీలను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను నిరసిస్తూ దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా చేపడతామని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి రైతులు, ప్రజలంటే పట్టింపు లేదని విమర్శించారు. రాష్ట్రంలో సుమారుగా 70 శాతం మందికి ఇంకా రుణమాఫీ కాలేదని ఆరోపించారు. రేషన్ కార్డులు లేవంటూ రుణమాఫీ నిరాకరించడం దారుణమని అన్నారు.
ఒక్క పాలకుర్తి మండలంలోనే 4,300 మంది రైతులకు రుణమాఫీ కాలేదని వెల్లడించారు. వరంగల్ డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ఒక వైపు రైతులు రుణమాఫీ రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం చేస్తున్నందుకే హస్తం పార్టీలో చేరానని కడియం శ్రీహరి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మరి కొన్ని రోజుల్లోనే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక రానుందని, తాటికొండ రాజయ్యను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఉద్యమ సమయంలో తనపై 300 కేసులున్నాయని, ఇప్పుడు మరో 30 కేసులు పెట్టారని ఎన్ని కేసులు పెట్టినా రేవంత్‌ను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. రుణమాఫీ వంద శాతం పూర్తయ్యే దాకా వెంటపడతామని స్పష్టం చేశారు. మాజీమంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తికి గతంలో మంజూరైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ధ్వజమెత్తారు.
మహిళలు, బాలికలకు భద్రత కరువైంది
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువైందని, వారిపట్ల ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. జనగామలో ఇద్దరు మైనర్లపై అత్యాచార ఘటన... తనను తీవ్రంగా కలచివేసిందని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హోంశాఖను నిర్వహిస్తున్నా.. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 2వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.